Tuesday, September 15, 2026
Homeమెదక్సూపర్ ఎల్‌నినో ప్రభావంపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

సూపర్ ఎల్‌నినో ప్రభావంపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

📰 Generate e-Paper Clip

– సాగునీటి లభ్యత లేని ప్రాంతాల్లో వరి సాగు చేయొద్దు

– తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి

– జూలై 15 తర్వాత జలాశయాల నీటి నిల్వల ఆధారంగా రైతులకు మార్గదర్శకాలు

– మహారాష్ట్ర, కర్ణాటక వరద పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలి

A2న్యూస్,, జులై 10, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ జిల్లా (9) సూపర్ ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, జలాశయాల్లో నీటి నిల్వలు, ఖరీఫ్ సాగు ప్రణాళికలపై గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ (ఐడీఓసీ) నుంచి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్, ఉద్యానవన శాఖ అధికారి ప్రతాప్ సింగ్, మిషన్ భగీరథ ఇంట్రా నాగభూషణం తదితరులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, జూలై 9 నాటికి రాష్ట్రంలో 15 శాతం వర్షపాతం లోటు నమోదైందన్నారు. 14 జిల్లాల్లో సాధారణ వర్షపాతం ఉండగా, 19 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైందని తెలిపారు. కృష్ణా బేసిన్‌లో గతేడాదితో పోలిస్తే నీటి నిల్వలు గణనీయంగా తగ్గాయని, ఎగువ రాష్ట్రాల నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రవాహం రాలేదన్నారు. ప్రస్తుతం శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో తాగునీటి అవసరాలకు మాత్రమే సరిపడా నీరు ఉందని చెప్పారు. గోదావరి బేసిన్‌లోని ఎస్సారెస్పీ, నిజాంసాగర్, సింగూరు, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టులకు ఇప్పటివరకు వరద రాలేదని, వచ్చే వారం రోజులపాటు భారీ వర్షాల అవకాశాలు కూడా లేవని వాతావరణ శాఖ అంచనా వేసిందన్నారు. నిపుణుల అంచనాల ప్రకారం ఆగస్టులో మాత్రమే సాధారణానికి సమీపంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని, జూలై, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కూడా వర్షపాతం లోటు కొనసాగే అవకాశముందని తెలిపారు.మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో వచ్చే వరదలపైనే కృష్ణా, గోదావరి ప్రాజెక్టులు నిండే పరిస్థితి ఆధారపడి ఉందని, ఆ అవకాశాలు కూడా పరిమితంగానే ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ఖరీఫ్‌లో గోదావరి, కృష్ణా బేసిన్ పరిధిలో సాగునీటి విడుదలకు ప్రణాళికలు లేవని రైతులకు స్పష్టంగా తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల ద్వారా సాధ్యమైనంత మేర నీటిని తరలించి చెరువులు, కుంటలు నింపేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. సాగునీటి లభ్యత లేని ప్రాంతాల్లో వరి సాగు చేయకుండా రైతులకు అవగాహన కల్పించాలని, తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని సూచించారు. రైతు వేదికలు, ప్యాక్స్‌ల ద్వారా నీటి లభ్యత, వర్షపాతం అంచనాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, వాతావరణం, వరద పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ రైతులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సూచించారు. నీటి లభ్యతకు అనుగుణంగా విత్తనాల సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని, జూలై 15 తర్వాత జలాశయాల్లో నీటి నిల్వలను సమీక్షించి ప్రత్యామ్నాయ పంటలపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని ఆదేశించారు.ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో వరద పరిస్థితులను నిరంతరం పరిశీలిస్తూ ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద వస్తే వెంటనే నీటిని ఎత్తిపోసేందుకు పంపింగ్ వ్యవస్థలను సిద్ధంగా ఉంచాలని, అప్పటివరకు అందుబాటులో ఉన్న నీటిని తాగునీటి అవసరాలకే ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మాట్లాడుతూ, సూపర్ ఎల్‌నినో పరిస్థితిని సవాల్‌గా కాక అవకాశంగా మలుచుకోవాలని అన్నారు. రాష్ట్రంలో 132 లక్షల ఎకరాల సాగు లక్ష్యానికి గాను ఇప్పటివరకు 55 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు జరిగిందన్నారు. జిల్లాల వారీగా నీటి లభ్యతను అంచనా వేసి పంటల వైవిధ్యీకరణకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఆయిల్‌పామ్, ఉద్యాన పంటలు, పట్టు పరిశ్రమకు అనుకూల పంటలు, తక్కువ నీటితో సాగయ్యే పంటలను ప్రోత్సహించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సంబంధిత అధికారులతో జిల్లాలోని నీటి లభ్యత, ఖరీఫ్ పంటల సాగు పరిస్థితులను సమీక్షించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!