మొక్కలు నాటడం సామాజిక బాధ్యత: జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
A2న్యూస్, జూన్ 15, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్, జూన్ 15: వనాలు పర్యావరణ పరిరక్షణకు వరాలని, మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా భావించాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపునిచ్చారు. ఈ నెల 18న రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలోని నగర్ వన్ యోజన పార్కులో వనమహోత్సవ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నట్లు ఆమె తెలిపారు.సోమవారం ప్రజావాణి కార్యక్రమం అనంతరం అదనపు కలెక్టర్ నగేష్, డీఎఫ్ఓ, డీఆర్ఓ అంబదాస్ రాజేశ్వర్ తదితర అధికారులతో కలిసి వనమహోత్సవం, ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులు, ఆస్తి పన్ను వసూళ్లు, ప్రభుత్వ కార్యాలయాల పరిశుభ్రత తదితర అంశాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జిల్లా అధికారులకు అభినందనలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడంలో వనమహోత్సవం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్చువల్‌గా ప్రారంభించనున్న వనమహోత్సవ కార్యక్రమాన్ని జిల్లాలో పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్ట కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. అటవీ, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్, సంక్షేమ, వ్యవసాయ, విద్య తదితర శాఖల సమన్వయంతో జిల్లాలో 31.95 లక్షల మొక్కలు నాటే లక్ష్యాన్ని నిర్దేశించామని చెప్పారు. ప్రతి శాఖ తనకు కేటాయించిన లక్ష్యాలకు అనుగుణంగా మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వనమహోత్సవాన్ని ప్రజా ఉద్యమంగా మార్చి ప్రతి పౌరుడు కనీసం ఒక మొక్కను నాటి దానిని పరిరక్షించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంపై దృష్టి
ప్రజావాణిలో వచ్చిన పెండింగ్ దరఖాస్తులను శాఖల వారీగా త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించాలని సూచించారు.
ఆస్తి పన్ను వసూళ్లకు పటిష్ట చర్యలు
ఆస్తి పన్ను వసూళ్లను మరింత వేగవంతం చేసేందుకు కలెక్టరేట్ నిర్వహణ కమిటీల ద్వారా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
కార్యాలయాల్లో పరిశుభ్రత తప్పనిసరి
కలెక్టరేట్‌లోని అన్ని శాఖల కార్యాలయాలు పరిశుభ్రతకు ఆదర్శంగా నిలవాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఆకస్మిక తనిఖీల సమయంలో అపరిశుభ్రంగా ఉన్న కార్యాలయాల అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమీక్ష సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

