లోటు వర్షపాతం నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులకు అవగాహన కల్పించాలి: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 8:
మెదక్ జిల్లా (7)ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు తక్కువ నీటి అవసరంతో అధిక దిగుబడినిచ్చే ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని రాష్ట్ర నీటిపారుదల, ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించారు. వరికి బదులుగా నీటి అవసరం తక్కువగా ఉండే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించాలని ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో కలిసి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వానాకాలం సాగు, వన మహోత్సవం, సమగ్ర వ్యవసాయ క్షేత్ర చెరువులు, స్మార్ట్ రేషన్ కార్డుల అమలుపై సమీక్షించారు.
9 జిల్లాల్లో లోటు వర్షపాతం
రాష్ట్రంలో ఇప్పటివరకు జిల్లాల వారీగా పరిశీలిస్తే 3 జిల్లాల్లో అధిక వర్షపాతం, 21 జిల్లాల్లో సాధారణ వర్షపాతం, 9 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైనట్లు మంత్రి తెలిపారు. మండలాల వారీగా 126 మండలాల్లో అధిక వర్షపాతం, 282 మండలాల్లో సాధారణ వర్షపాతం, 205 మండలాల్లో లోటు, 8 మండలాల్లో భారీ లోటు వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు. భూగర్భ జలాల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ సాగు అవసరాలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రత్యామ్నాయ పంటలకు అవసరమైన విత్తనాలు, ఎరువులను ముందుగానే అందుబాటులో ఉంచాలని సూచించారు.
99.81 లక్షల ఎకరాల్లో సాగు
వానాకాలం 2026లో రాష్ట్ర సాధారణ సాగు విస్తీర్ణం 1 కోటి 32 లక్షల 38 వేల 714 ఎకరాలు కాగా, తుది సాగు విస్తీర్ణం 1 కోటి 8 లక్షల 22 వేల 389 ఎకరాలుగా ఉందని మంత్రి తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 99.81 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయని వెల్లడించారు. ఇందులో పత్తి 47.25 లక్షల ఎకరాలు, పప్పుధాన్యాలు 6.14 లక్షల ఎకరాలు, నూనెగింజలు 3.76 లక్షల ఎకరాలు, చెరుకు 38,149 ఎకరాలు, కూరగాయలు 43,802 ఎకరాల్లో సాగవుతున్నాయని తెలిపారు. జూలైలో నిర్వహించిన విత్తన మేళాల ద్వారా నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులోకి తీసుకురాగా, 3,116 మంది రైతులు వివిధ పంటలకు సంబంధించిన విత్తనాలను కొనుగోలు చేశారని పేర్కొన్నారు. వానాకాలం సాగు అవసరాల కోసం గోదావరి, కృష్ణా బేసిన్లలోని ప్రాజెక్టుల నుంచి సాగునీటి విడుదలకు కార్యాచరణ సిద్ధం చేసినట్లు మంత్రి తెలిపారు.
16.06 కోట్ల మొక్కలు నాటే లక్ష్యం
2026 వన మహోత్సవంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 16.06 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటివరకు 6.28 కోట్ల మొక్కలు నాటడం, పంపిణీ చేయడం ద్వారా 39 శాతం ప్రగతి సాధించినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని నర్సరీల్లో 16.29 కోట్ల మొక్కలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. అవెన్యూ ప్లాంటేషన్‌లో భాగంగా 176.959 కిలోమీటర్ల మేర రహదారుల వెంట, కాలువ కట్టలు, చెరువుగట్లు, వ్యవసాయ భూముల కట్టల వెంట మొక్కలు నాటేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. బ్లాక్ ప్లాంటేషన్, సంస్థాగత ప్లాంటేషన్, ఇంటి ఆవరణలు, పారిశ్రామిక ప్రాంతాల్లోనూ పెద్దఎత్తున మొక్కలు నాటాలని సూచించారు. నాటిన ప్రతి మొక్కను తప్పనిసరిగా టి జి ఎఫ్ ఎం ఐ ఎస్ పోర్టల్‌లో జియో ట్యాగింగ్ చేసి, వాటి మనుగడ శాతాన్ని నిరంతరం నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.
క్షేత్ర చెరువుల పనులు వేగవంతం చేయాలి
స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో చేపడుతున్న సమగ్ర వ్యవసాయ క్షేత్ర చెరువుల పథకం పనులను వేగవంతం చేయాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో 13,046 క్షేత్ర చెరువుల నిర్మాణాన్ని లక్ష్యంగా నిర్దేశించగా, ఈ నెల 15వ తేదీ నాటికి పనులన్నింటినీ ప్రారంభించి పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఆదేశించారు.“ఒకే చెరువు–ఆరు రకాల జీవనోపాధులు” అనే భావనతో నీటిపారుదల, చేపల పెంపకం, పాడి పరిశ్రమ, కూరగాయల సాగు, పశుగ్రాస అభివృద్ధి, సేంద్రీయ ఎరువుల తయారీ వంటి కార్యక్రమాలను చేపట్టి మహిళా రైతుల ఆదాయాన్ని పెంచేలా శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
పౌరసరఫరాల వ్యవస్థను మరింత పారదర్శకంగా, భద్రతాయుతంగా మార్చేందుకు తెలంగాణ స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం ప్రవేశపెడుతోందని మంత్రి తెలిపారు. డిజిటల్ సంతకం, హోలోగ్రామ్, వాటర్‌మార్క్, ఎన్‌క్రిప్టెడ్ క్యూ.ఆర్. కోడ్, యూవీ లోగో తదితర ఆధునిక భద్రతా ఫీచర్లతో స్మార్ట్ రేషన్ కార్డులను రూపొందించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో 1 కోటి 6 లక్షల 20 వేల 92 రేషన్ కార్డుల ద్వారా 3 కోట్ల 42 లక్షల 57 వేల 109 మంది లబ్ధిదారులకు ప్రతినెలా 2.16 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నూతనంగా 16 లక్షల 32 వేల 810 రేషన్ కార్డులను జారీ చేసిందని వెల్లడించారు.
అధికారులతో కలెక్టర్ సమీక్ష
మెదక్ జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, జిల్లా అటవీ అధికారి జోజి, డీఆర్‌ఓ అంబదాస్ రాజేశ్వర్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, మెదక్ ఆర్డీఓ రమాదేవి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి దేవకుమార్, ఉద్యానవన శాఖ అధికారి ప్రతాప్‌సింగ్, డీఎం సివిల్ సప్లై నిత్యానంద్‌తో పాటు ఇతర జిల్లా అధికారులు హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో వానాకాలం సాగు, వన మహోత్సవం, సమగ్ర వ్యవసాయ క్షేత్ర చెరువులు, స్మార్ట్ రేషన్ కార్డుల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. లోటు వర్షపాతం పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పిస్తూ పంటల మార్పు, ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని తెలిపారు. శాఖల వారీగా కేటాయించిన వన మహోత్సవం లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. క్షేత్ర చెరువుల నిర్మాణం, స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

