నాలుగేళ్లుగా మహిళలు, చిన్నారులకు సమన్వయంతో సేవలు
మరింత సమర్థవంతంగా సేవలందించాలి: అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 8:
మెదక్ జిల్లా (7) మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల్లో బాధితులకు అండగా నిలుస్తూ, వారికి అవసరమైన సహాయాన్ని ఒకే వేదికపై అందిస్తున్న భరోసా కేంద్రం నాలుగో వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ హాజరై కేక్ కట్ చేసి వార్షికోత్సవ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ.. గత నాలుగేళ్లుగా భరోసా కేంద్రం మహిళలు, చిన్నారులపై జరిగిన నేరాల బాధితులకు అండగా నిలుస్తూ, వారికి అవసరమైన కౌన్సెలింగ్, న్యాయ సహాయం, వైద్య సహాయం, పునరావాస సేవలను సమన్వయంతో అందిస్తోందన్నారు. నేరం జరిగిన అనంతరం బాధితులు ఎదుర్కొనే మానసిక ఒత్తిడి, భయాందోళనలను అధిగమించేలా ధైర్యం కల్పించడంతో పాటు, న్యాయం పొందే వరకు అవసరమైన సహకారం అందించడం భరోసా కేంద్రం ప్రధాన లక్ష్యమన్నారు. బాధితుల గోప్యత, గౌరవానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ సున్నితమైన విధానంతో వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు. బాధితులకు సత్వర సహాయం అందేలా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. భవిష్యత్తులోనూ ఇదే సేవా దృక్పథంతో మరింత సమర్థవంతంగా పనిచేస్తూ బాధితులకు వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందించాలని అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ సూచించారు. కార్యక్రమంలో ఎస్ఐ సుచరిత, భరోసా కోఆర్డినేటర్ సౌమ్య, భరోసా కేంద్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

