పాత్రికేయుల సమస్యలపై సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్
నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గానికి సన్మానం
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 8:
మెదక్ జిల్లా (7) ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో మీడియా పాత్ర మరువలేనిదని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ అన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య పాత్రికేయులు వారధిగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. మెదక్ ప్రెస్ క్లబ్ నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు నరసింహచారి, ప్రధాన కార్యదర్శి సంగమేశ్వర్తో పాటు నూతన కార్యవర్గ సభ్యులు శుక్రవారం జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కార్యవర్గ సభ్యులను కలెక్టర్ శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు జిల్లాలో పాత్రికేయులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. పాత్రికేయుల సమస్యలను సానుకూలంగా విన్న కలెక్టర్ ప్రతిమ సింగ్, వాటి పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో కూడా పాత్రికేయుల సేవలు ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశాల్లో మీడియా, ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తే మరింత మెరుగైన ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులు, పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు.

