నీటి భద్రతకు ప్రాధాన్యం.. ఐదేళ్ల అభివృద్ధి ప్రణాళికపై కలెక్టర్ కీలక ఆదేశాలు
వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికను పకడ్బందీగా రూపొందించాలి
– జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 26:
మెదక్ జిల్లా (25) ఎల్నినో ప్రభావంతో పాటు మారుతున్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గ్రామాల భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సమగ్ర అభివృద్ధి ప్రణాళికలను రూపొందించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామానికి అవసరమైన అభివృద్ధి పనులను గుర్తించి, వాటికి ప్రాధాన్యత క్రమాన్ని నిర్ణయిస్తూ వచ్చే ఐదేళ్లకు ఉపయోగపడే విధంగా **వికసిత్ గ్రామ పంచాయతీ ప్లాన్ (వి జి పి పి)ను పకడ్బందీగా రూపొందించాలని సూచించారు. వీబీజీ రామ్జీ కార్యక్రమంలో భాగంగా వి జి పి పి తయారీపై శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ ప్రతిమా సింగ్ గ్రామాల అభివృద్ధి ప్రణాళికపై పలు కీలక సూచనలు చేశారు. గ్రామాల్లో అందుబాటులో ఉన్న వనరులు, ప్రజల అవసరాలు, అభివృద్ధి అవకాశాలను సమగ్రంగా గుర్తించాలని అధికారులను కోరారు. ముఖ్యంగా నీటి భద్రత, వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. అక్టోబర్ 2న గ్రామసభలో ఆమోదంగ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలను అక్టోబర్ 2న నిర్వహించే గ్రామసభల్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామసభల్లో ప్రజలందరూ భాగస్వాములు అయ్యేలా చూడాలని, వివిధ శాఖల అధికారులు తమ పరిధిలో చేపట్టాల్సిన పనులను గుర్తించి సాంకేతిక సూచనలు అందించడంతో పాటు ప్రతిపాదనలను ప్రజలకు వివరించాలని సూచించారు. గ్రామాల్లో కూలీల (వేజ్ సీకర్స్) సంఖ్యను పెంచడంతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి పనులకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు విస్తృతంగా చేరవేయాలని అధికారులను కోరారు.
22 విభాగాల్లో 318 రకాల పనులకు అవకాశం
వీబీజీ రామ్జీ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో 22 విభాగాలకు సంబంధించిన 318 రకాల పనులను చేపట్టే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. ప్రతి గ్రామానికి అత్యవసరంగా అవసరమైన పనులను గుర్తించి, వాటికి ప్రాధాన్యత క్రమాన్ని నిర్ణయించి వి జి పి పి లో చేర్చాలని సూచించారు.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గ్రామాల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర ప్రణాళికను రూపొందిస్తే గ్రామాల అభివృద్ధికి మరింత మెరుగైన అవకాశాలు ఏర్పడతాయని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. ఆయా పనులకు సంబంధించిన మార్గదర్శకాలు, వివరాలను అధికారులకు ఆమె వివరించారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి శ్రీనివాసరావు, జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, జెడ్పీ సీఈవో ఎల్లయ్యతో పాటు వివిధ శాఖల అధికారులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

