A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 26:
మెదక్ జిల్లా (25) మావోయిస్టుల పేరుతో తూప్రాన్ మున్సిపల్ కార్యాలయం, పోలీస్‌స్టేషన్ ఆవరణలో బెదిరింపు లేఖలు, ఎర్ర వస్త్రాలు ఉంచిన ఘటనలో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. నాగులపల్లి గ్రామానికి చెందిన బండ మధు (23), చింతకింది శ్రీధర్ (23)లను అరెస్టు చేసి, బైక్, రెండు మొబైల్ ఫోన్లు, రెయిన్‌కోట్, శాలువా, పెన్నులను స్వాధీనం చేసుకున్నారు.
సోషల్ మీడియాలో ప్రచారం, ఫాలోవర్లు, వ్యూస్ పెంచుకోవాలనే ఉద్దేశంతోనే ఈ చర్యకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. 21/22 సెప్టెంబర్ అర్ధరాత్రి మాస్క్ ధరించిన మధు పోలీస్‌స్టేషన్‌లోకి వెళ్లి లేఖతో కూడిన ఎర్ర వస్త్రాన్ని టేబుల్‌పై ఉంచగా, శ్రీధర్ బయట బైక్‌పై వేచి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం వద్ద కూడా ఇలాంటి లేఖను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక బృందం 24 సెప్టెంబర్ సాయంత్రం నాగులపల్లి బ్రిడ్జి వద్ద ఇద్దరినీ అరెస్టు చేసింది. ఈ కేసును తక్కువ సమయంలో ఛేదించిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

