చేగుంట పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మెదక్ జిల్లా ఎస్పీ
A2న్యూస్, జూలై 17, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
చేగుంట(16) మెదక్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) డి.వి. శ్రీనివాస రావు గురువారం చేగుంట పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లో నిర్వహిస్తున్న రికార్డులు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, సీసీ కెమెరాల పనితీరు, రిసెప్షన్ విధులు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న కేసులను నాణ్యతతో, వేగవంతంగా దర్యాప్తు పూర్తి చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు. ప్రతి కేసులో శాస్త్రీయ ఆధారాలు సేకరించి చట్టబద్ధంగా దర్యాప్తు నిర్వహించాలని సూచించారు. రిసెప్షన్ విధులను పరిశీలించిన ఎస్పీ, పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుని మర్యాదపూర్వకంగా స్వాగతించి, వారి ఫిర్యాదులను వెంటనే నమోదు చేసి చట్టప్రకారం సత్వర చర్యలు చేపట్టాలని సూచించారు. బాధితులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలకు నాణ్యమైన పోలీసు సేవలు అందించాలని ఆదేశించారు. స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించిన ఎస్పీ, రాత్రి గస్తీని మరింత పటిష్ఠం చేయడంతో పాటు నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల వినియోగాన్ని విస్తృతంగా పెంచాలని సూచించారు. ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా పర్యవేక్షించాలని, పనిచేయని కెమెరాలను వెంటనే మరమ్మతులు చేసి నిఘా వ్యవస్థను బలోపేతం చేయాలని ఆదేశించారు. అలాగే రోడ్డు ప్రమాదాల నివారణ కోసం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, ప్రజల్లో రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాలను నిరంతరం నిర్వహించాలని సూచించారు. అనంతరం పోలీసు సిబ్బందితో సమావేశమైన ఎస్పీ, విధి నిర్వహణలో అప్రమత్తత, క్రమశిక్షణ, నిజాయితీ పాటిస్తూ ప్రజల పట్ల మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదును వెంటనే స్వీకరించి, పారదర్శకంగా విచారణ చేపట్టి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ తనిఖీలో సీఐలు రాజా శేఖర్ రెడ్డి, సైదా, ఎస్‌ఐ చైతన్య కుమార్ రెడ్డి తదితర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

