మెదక్ జిల్లాలో 1.81 లక్షల మంది పిల్లలకు అల్బెండజోల్ మాత్రలు – జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
A2న్యూస్, జులై 13, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్ జిల్లా (12) జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం (నేషనల్ డీ-వార్మింగ్ డే) కార్యక్రమానికి మెదక్ జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. జిల్లాలో 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల 1,81,425 మంది పిల్లలను గుర్తించగా, వారికి పంపిణీ చేసేందుకు 2,36,400 అల్బెండజోల్ మాత్రలను సిద్ధంగా ఉంచినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అవసరమైన మాత్రలను పంపిణీ చేయడంతో పాటు, కార్యక్రమ నిర్వహణపై వైద్య సిబ్బందికి శిక్షణ పూర్తి చేసినట్లు వెల్లడించారు. జూలై 13న పాఠశాలల్లో ఉదయం ప్రార్థన అనంతరం విద్యార్థులకు చేతుల పరిశుభ్రత, నులిపురుగుల నివారణ, అల్బెండజోల్ మాత్రల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించి మాత్రలు వేయనున్నట్లు తెలిపారు. ఆ రోజున మాత్రలు తీసుకోలేని పిల్లల కోసం జూలై 20న మాప్-అప్ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. అల్బెండజోల్ మాత్రలు కడుపులోని నులిపురుగులను నిర్మూలించి పిల్లల్లో పోషకాహార లోపం, రక్తహీనత, అలసట, ఆకలి మందగించడం, కడుపు నొప్పి వంటి సమస్యలను నివారించడంలో దోహదపడతాయని తెలిపారు. ఈ మాత్రల వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని, అవసరమైతే నిపుణులైన చిన్నపిల్లల వైద్యుల సేవలు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు గోర్లు చిన్నగా, శుభ్రంగా ఉంచుకోవడం, శుభ్రమైన నీటినే తాగడం, పండ్లు, కూరగాయలను శుభ్రంగా కడిగి తీసుకోవడం, భోజనం ముందు మరియు మరుగుదొడ్డి వినియోగం తర్వాత చేతులను సబ్బుతో కడుక్కోవడం, బహిరంగ మలవిసర్జనకు దూరంగా ఉండడం, మరుగుదొడ్లను వినియోగించడం, పాదరక్షలు ధరించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వంటి అలవాట్లు తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, వృత్తి విద్యా సంస్థలు, బాలల సంరక్షణ గృహాలు, అనాథాశ్రమాలు, వలస కార్మికుల పిల్లలు, వీధి బాలల ఆశ్రయ కేంద్రాల్లోని పిల్లలందరికీ ఈ కార్యక్రమం అమలు చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. జిల్లా అధికారులు, వైద్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, ప్రభుత్వ–ప్రైవేట్ విద్యాసంస్థలు, మీడియా ప్రతినిధులు మరియు తల్లిదండ్రులు సమన్వయంతో సహకరించి జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపునిచ్చారు.

