A2న్యూస్, జులై 18, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్(17) జిల్లాలోని అర్హులైన రేషన్ కార్డుదారులందరూ ఈ నెల జూలై 31, 2026 లోపు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని జిల్లా పౌర సరఫరాల అధికారి నిత్యానంద్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. పౌర సరఫరాల కమిషనర్ ( సి సి ఎస్) ఆదేశాల మేరకు, భారత ప్రభుత్వానికి(జి ఓ ఎల్ ) ఈ-కేవైసీ వివరాలను నవీకరించాల్సి ఉన్నందున జిల్లాలో ఈ ప్రక్రియను అత్యంత ప్రాధాన్యతతో చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని రేషన్ దుకాణాల డీలర్లు తమ పరిధిలోని లబ్ధిదారులతో పాటు ‘వన్ నేషన్–వన్ రేషన్ కార్డ్'( ఓ ఎన్ ఓ ఆర్ సి) పోర్టబిలిటీ ద్వారా రేషన్ పొందుతున్న లబ్ధిదారుల ఈ-కేవైసీని కూడా తప్పనిసరిగా పూర్తి చేయాలని ఆదేశించినట్లు వెల్లడించారు. మెదక్ జిల్లాలోని అన్ని రేషన్ దుకాణాలను ప్రతిరోజూ నిరంతరాయంగా తెరిచి ఉంచి, అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఈ-కేవైసీ నిర్వహించి జూలై 31లోపు 100 శాతం ఈ-కేవైసీ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని డీలర్లకు సూచించినట్లు తెలిపారు. త్వరలో కమిషనర్ జిల్లాల వారీగా ఈ-కేవైసీ పురోగతిని సమీక్షించనున్నందున, అర్హులైన రేషన్ కార్డుదారులందరూ తమ సమీప రేషన్ దుకాణాన్ని సందర్శించి నిర్ణీత గడువులోపు ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని జిల్లా పౌర సరఫరాల అధికారి నిత్యానంద్ విజ్ఞప్తి చేశారు.

