Thursday, September 17, 2026
Homeమెదక్రుణ లక్ష్యాలను సాధించాలి

రుణ లక్ష్యాలను సాధించాలి

📰 Generate e-Paper Clip

తొలి త్రైమాసికంలో రూ.1,713.32 కోట్ల రుణాల పంపిణీ.. 24.33 శాతం లక్ష్య సాధన

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 11:

మెదక్ జిల్లా (10) జిల్లాలో ఆర్థిక వృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు బ్యాంకర్లు జిల్లా యంత్రాంగంతో సమన్వయంతో పనిచేసి నిర్దేశిత రుణ లక్ష్యాలను వందశాతం సాధించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్‌–జూన్‌ 2026) వివిధ రంగాలకు రూ.1,713.32 కోట్ల రుణాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని మినీ మీటింగ్ హాల్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన లబ్ధిదారులకు చేరడంలో బ్యాంకుల పాత్ర అత్యంత కీలకమన్నారు. తొలి త్రైమాసికంలో నిర్దేశించిన రుణ లక్ష్యంలో 24.33 శాతం సాధించడం అభినందనీయమని పేర్కొన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలు, స్వయం సహాయక సంఘాలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రాధాన్యతనిస్తూ రుణాలు అందించడం ద్వారా జిల్లాలో ఆర్థిక స్వావలంబనకు దోహదపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా బ్యాంకర్లు, జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేసి రుణ లక్ష్యాలను పూర్తిగా సాధించాలని సూచించారు. రంగాల వారీగా రుణాల పంపిణీ వ్యవసాయం, అనుబంధ రంగాలు – రూ.936.80 కోట్లు ఎంఎస్‌ఎంఈ రంగం – రూ.316.31 కోట్లు స్వయం సహాయక మహిళా సంఘాలు – రూ.144.28 కోట్లు గృహ రుణాలు – రూ.4.46 కోట్లు విద్యా రుణాలు – రూ.0.93 కోట్లు ఇతర రంగాలు – రూ.441.10 కోట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల ద్వారా అందించే రుణాల దరఖాస్తులను బ్యాంకుల్లో పెండింగ్‌లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. యువతకు ఉపాధి కల్పించే పీఎం ఈజీపీ, పీఎం విశ్వకర్మ వంటి పథకాలపై బ్యాంకర్లు ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. బ్యాంకింగ్ రంగంలో పెరుగుతున్న మోసాల నేపథ్యంలో వినియోగదారులకు భద్రత కల్పించేందుకు ‘కేవైసీ – సురక్షిత బ్యాంకింగ్‌కు మీ తొలి అడుగు’ పేరుతో జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. పాత ఖాతాల్లో పేరుకుపోయిన లేదా క్లెయిమ్ చేయని డిపాజిట్ల వివరాలను తెలుసుకునేందుకు ఉద్గమ్ పోర్టల్ను వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు. జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతాదారులు ఆధార్, పాన్ వివరాలతో తమ ఖాతాలను అప్‌డేట్ చేసుకోవాలని కోరారు.బ్యాంకులు రుణాలు మంజూరు చేయడమే కాకుండా, ఇచ్చిన రుణాలు సకాలంలో తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు రుణాలను వ్యాపారాల అభివృద్ధికి సద్వినియోగం చేసుకుని, సకాలంలో చెల్లింపులు జరిపి బ్యాంకులతో సత్సంబంధాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ బాపూజీ, ఆర్బీఐ ప్రతినిధి హేమలత, నాబార్డ్ డీడీఎం కృష్ణచైతన్య, వివిధ బ్యాంకుల ఏజీఎంలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!