Tuesday, September 15, 2026
Homeమెదక్పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

📰 Generate e-Paper Clip

A2న్యూస్, జూలై 21, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ (20) మెదక్ జిల్లా హవేళి ఘనపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 17 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు చాకలి ప్రవీణ్ (21)కు జిల్లా పోక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించినట్లు జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. ఎస్పీ వెల్లడించిన వివరాల ప్రకారం.. నిందితుడు అదే ప్రాంతానికి చెందిన ఇంటర్మీడియట్ చదువుతున్న 17 ఏళ్ల బాలికను బెదిరిస్తూ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనల ఫలితంగా బాధిత బాలిక గర్భం దాల్చింది. తన మేనత్త వద్ద ఉంటూ చదువుకుంటున్న బాలికను, ఆమె శారీరక పరిస్థితిపై అనుమానం వచ్చిన మేనత్త ప్రశ్నించగా, నిందితుడు ఇంట్లోకి వచ్చి బెదిరిస్తూ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన విషయాన్ని బాలిక వెల్లడించింది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు హవేళి ఘనపూర్ పోలీస్ స్టేషన్‌లో అప్పటి ఏఎస్సై డి. విఠల్ కేసు నమోదు చేశారు. అనంతరం అప్పటి దర్యాప్తు అధికారులు మెదక్ రూరల్ సీఐ పలవెల్లి, అప్పటి డీఎస్పీ కృష్ణమూర్తి సమగ్ర దర్యాప్తు నిర్వహించి, అవసరమైన సాక్ష్యాధారాలు సేకరించి న్యాయస్థానంలో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. కేసు విచారణ సందర్భంగా భరోసా లీగల్ అడ్వైజర్ శ్వేత బాధిత బాలికకు న్యాయపరమైన సహకారం అందించగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాలయ్య బలమైన వాదనలు వినిపించారు. సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన జిల్లా పోక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తి నిందితుడిపై అభియోగాలు రుజువైనట్లు నిర్ధారించి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5,000 జరిమానా విధించారు. ఈ కేసులో లైజనింగ్ అధికారి ఎస్సై విఠల్, కానిస్టేబుల్ కృష్ణ, సీడీవో గౌస్ తదితరులు కీలకంగా సహకరించారు. నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ, బాలికలు, మహిళలపై లైంగిక నేరాలకు పాల్పడే వారిపై చట్టం ఎలాంటి ఉపేక్ష చూపదన్నారు. పోక్సో చట్టం కింద నమోదయ్యే కేసుల్లో మెదక్ జిల్లా పోలీసులు వేగవంతమైన, శాస్త్రీయ దర్యాప్తు చేపట్టి నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. చిన్నారులపై లైంగిక వేధింపులు, దాడులు లేదా దుర్వినియోగం జరిగినట్లయితే భయపడకుండా వెంటనే సమీప పోలీస్ స్టేషన్, డయల్–100, డయల్–112 లేదా 1098 చైల్డ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. బాధిత చిన్నారులకు చట్టపరమైన, వైద్యపరమైన, మానసిక సహాయాన్ని అందించేందుకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎస్పీ పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!