పాలపిట్ట దర్శనంతో గ్రామస్తుల్లో ఆనందోత్సాహం
A2న్యూస్, మనోహరాబాద్ ప్రతినిధి (జల్లి రామకృష్ణ) అక్టోబర్ 21:
మనోహరాబాద్ (20) మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలవ్యాప్తంగా విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గౌతాజిగూడ గ్రామంలో సర్పంచ్ నాగరాజు అధ్యక్షతన దసరా సంబరాలను సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు డప్పు చప్పుళ్ల నడుమ ఊరేగింపుగా సమీపంలోని పొలాలకు వెళ్లి, జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆకాశంలో ఎగురుతున్న పాలపిట్టను దర్శించుకుని, గ్రామ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ నాగరాజు మాట్లాడుతూ.. చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి విజయదశమి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. దసరా పండుగ ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, సిరిసంపదలు నింపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నాగరాజు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంప్రదాయబద్ధంగా నిర్వహించిన దసరా వేడుకలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనగా, గ్రామస్తులు ఆనందోత్సాహాల మధ్య వేడుకలను జరుపుకున్నారు.

