చారిత్రక ఆధారాలు ప్రజల వద్ద ఉంటే 8309507937కు సమాచారం ఇవ్వాలి
జిల్లా అదనపు కలెక్టర్ నగేష్
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 23:
మెదక్ జిల్లా (22) దేశ చరిత్ర, సంస్కృతి, సాహిత్యం, విజ్ఞానం, సంప్రదాయ జ్ఞానానికి ప్రతీకగా నిలిచే పురాతన లిపులు, చారిత్రక దస్తావేజులు, శాసనాలు, శిలా శాసనాలు, పురాతన చిహ్నాలు, గ్రంథాలు తదితర వారసత్వ సంపదను గుర్తించి, నమోదు చేసి, పరిరక్షించడంతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో డిజిటలైజ్ చేసి భావితరాలకు అందించడమే జ్ఞాన్ భారత్మ్ మిషన్ ప్రధాన ఉద్దేశ్యమని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. మంగళవారం మెదక్ కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో జిల్లా చారిత్రక ఆధారాలు, వారసత్వ సంపద సేకరణపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భారతదేశంలో అపారంగా ఉన్న జ్ఞాన, సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. దేశవ్యాప్తంగా కుటుంబాలు, దేవాలయాలు, మఠాలు, గ్రంథాలయాలు, విద్యాసంస్థలు, మ్యూజియంలు, పరిశోధనా సంస్థలు, వ్యక్తిగత సేకరణల్లో ఉన్న పురాతన లిపులు, గ్రంథాలు, చారిత్రక ఆధారాలను గుర్తించి వాటి వివరాలను నమోదు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా పురాతన లిపులు, గ్రంథాలు, చారిత్రక దస్తావేజులు, శాసనాలు, శిలా శాసనాలు, ఇతర వారసత్వ ఆధారాలకు సంబంధించిన భాష, లిపి, కాలం, ప్రదేశం, విషయ వివరణ తదితర వివరాలను సేకరిస్తామని చెప్పారు. అనంతరం వాటిని శాస్త్రీయ పద్ధతుల్లో పరిరక్షించి, అత్యున్నత ప్రమాణాలతో డిజిటలైజ్ చేసి జాతీయ డిజిటల్ రిపోజిటరీలో భద్రపరిచే విధంగా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు. మెదక్ జిల్లా ప్రజల వద్ద ఏవైనా పురాతన చారిత్రక ఆధారాలు, వారసత్వ సంపద ఉంటే 8309507937 ఫోన్ నంబర్‌కు సమాచారం అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ కోరారు. ప్రజలు అందించే సమాచారాన్ని పరిశీలించి, వివరాలు నమోదు చేసిన అనంతరం సంబంధిత వారసత్వ వస్తువులను తిరిగి వారికి అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ అధికారులు పాల్గొన్నారు.

