ఆధార్ నమోదు ద్వారా తల్లిదండ్రుల ఆచూకీ గుర్తింపు
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 9:
మెదక్ జిల్లా (8) మతి స్థిమితం లేని బాలిక 11 ఏళ్ల క్రితం ఇంటి నుంచి తప్పిపోగా, ఆమె తల్లిదండ్రుల ఆచూకీని గుర్తించి తిరిగి వారి చెంతకు చేర్చినట్లు జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి తెలిపారు. మంగళవారం ఆమె ఒక ప్రకటనలో ఈ వివరాలను వెల్లడించారు. జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లా మునుగోడు మండలానికి చెందిన దంపతుల కుమార్తె మతి స్థిమితం లేని బాలిక అని తెలిపారు. సుమారు 11 ఏళ్ల క్రితం ఇంటి నుంచి తప్పిపోయిన ఆమె మెదక్ జిల్లాలోని బేతాని సంరక్షణ ఆశ్రమంలో చేరి అప్పటి నుంచి అక్కడే ఆశ్రయం పొందుతున్నట్లు వివరించారు. బాలికకు ఆధార్ కార్డు లేకపోవడంతో ఆధార్ నమోదు చేయించేందుకు పలుమార్లు ప్రయత్నించినప్పటికీ వివిధ కారణాలతో నమోదు ప్రక్రియ తిరస్కరణకు గురైనట్లు తెలిపారు. అనంతరం బాలికను మాదాపూర్‌లోని ఆధార్ కేంద్రంలో నమోదు చేయించగా ఆధార్ నంబర్ మంజూరైనట్లు పేర్కొన్నారు. ఆధార్ వివరాల ఆధారంగా బాలిక తల్లిదండ్రుల ఆచూకీని గుర్తించి, వారిని పిలిపించి బాలికను వారి వద్దకు అప్పగించినట్లు హేమ భార్గవి తెలిపారు. 11 ఏళ్ల తర్వాత తమ కుమార్తె తమ చెంతకు చేరడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ సిబ్బంది నాగరాజు, శ్రీనివాస్, సరిత, మంజుల, అలాగే బేతాని సంరక్షణ ఆశ్రమం సోషల్ వర్కర్ వీరబాబు పాల్గొన్నారు.

