4.21 లక్షల ఆర్థిక సాయం చెక్కు అందజేత
మహిపాల్ భార్యకు ఉద్యోగం వచ్చేలా చర్యలు: ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 12 :
మెదక్ జిల్లా (11) విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన శివంపేట పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ మహిపాల్ కుటుంబానికి జిల్లా పోలీసు శాఖ అండగా నిలిచింది. కుటుంబ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది కలిసి సేకరించిన రూ.4.21 లక్షల ఆర్థిక సాయం చెక్కును శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు మహిపాల్ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మహిపాల్ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి పరిస్థితిని తెలుసుకున్నారు. “మీరు కూడా పోలీసు కుటుంబంలో భాగమే. ఎలాంటి సమస్య వచ్చినా నేరుగా నన్ను సంప్రదించండి. పోలీసు శాఖ అన్ని విధాలా అండగా ఉంటుంది” అని భరోసా ఇచ్చారు. మహిపాల్ శాలరీ అకౌంట్ ద్వారా రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు త్వరగా అందేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. అలాగే మహిపాల్ భార్యకు ఉద్యోగం త్వరగా వచ్చేలా అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. తోటి ఉద్యోగి కుటుంబానికి అండగా నిలిచేందుకు జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది తమ వంతుగా ఆర్థిక సాయం అందించడం పట్ల మహిపాల్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

