రామాయంపేట సీహెచ్‌సీని పరిశీలించిన డీసీహెచ్‌ఎస్ డాక్టర్ శివ దయాల్
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 9:
రామాయంపేట (8) జిల్లాలో ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేసే దిశగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పనిచేస్తోందని డీసీహెచ్‌ఎస్ డాక్టర్ శివ దయాల్ తెలిపారు. మంగళవారం రామాయంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ)ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, వైద్య సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వివిధ వైద్య నిపుణుల సేవలను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ శివ దయాల్ మాట్లాడుతూ,జిల్లాలో ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ యంత్రాంగం పనిచేస్తోందన్నారు. డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ గణేశ్వర్ ప్రతిరోజూ జిల్లాలోని వివిధ ఆరోగ్య కేంద్రాలను సందర్శిస్తూ, రోగులకు అందుతున్న వైద్య సేవలు, వైద్య సిబ్బంది పనితీరును పరిశీలించి అవసరమైన సూచనలు, సలహాలు అందిస్తున్నారని తెలిపారు. అందులో భాగంగానే రామాయంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను పరిశీలించినట్లు చెప్పారు. ఆసుపత్రిలో వైద్య సిబ్బంది విధి నిర్వహణను పరిశీలించడంతో పాటు, నూతనంగా వివిధ విభాగాలకు చెందిన వైద్య నిపుణులు బాధ్యతలు స్వీకరించినట్లు తెలిపారు. వైద్యులు, సిబ్బంది వృత్తిపట్ల క్రమశిక్షణ, నిబద్ధతతో విధులు నిర్వహించాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించినట్లు తెలిపారు. వివిధ వ్యాధులకు సంబంధించిన మందులను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. ఏ ప్రాంతంలోనైనా ప్రజలు తీవ్రమైన జ్వరాలతో బాధపడుతున్నట్లు గుర్తిస్తే, వెంటనే హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి, వ్యాధి తీవ్రతను బట్టి అవసరమైన వైద్య పరీక్షలు, చికిత్సలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

