A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 30 :
మెదక్ జిల్లా (29 )జిల్లాలో ధాన్య నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు గోదాముల నిర్మాణానికి అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. జిల్లాకు నిర్దేశించిన 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్య నిల్వ సామర్థ్య లక్ష్యాన్ని సాధించే దిశగా అనువైన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పి ఎ సి ఎస్)ను గుర్తించి గోదాముల నిర్మాణం చేపట్టాలని సూచించారు. మెదక్ జిల్లా కలెక్టరేట్‌లో శనివారం జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధ్యక్షతన జిల్లా సహకార అభివృద్ధి కమిటీ (డి సి డి సి) సమావేశం నిర్వహించారు. మెదక్ జిల్లా సహకార అధికారి, కమిటీ కన్వీనర్ పద్మ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో జిల్లాలో ధాన్య నిల్వ గోదాముల నిర్మాణం, భూ కేటాయింపు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం సహకార శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్య నిల్వల పథకం కింద జిల్లాలోని పి ఎ సి ఎస్ స్థాయిలో ధాన్య నిల్వ గోదాముల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని తెలిపారు. ఇందుకోసం అవసరమైన భూమిని గుర్తించి కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పి ఎ సి ఎస్ స్థాయిలో గోదాములు అందుబాటులోకి వస్తే రైతులు తమ ధాన్యాన్ని స్థానికంగానే నిల్వ చేసుకునే అవకాశం కలుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. దీంతో పంటను వెంటనే తక్కువ ధరకు విక్రయించాల్సిన పరిస్థితి తగ్గడంతో పాటు, ధాన్య నిల్వ సామర్థ్యం పెరుగుతుందని తెలిపారు. రైతులకు మరింత ప్రయోజనం కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యమన్నారు. సమావేశంలో యెల్దుర్తి పి ఎ సి ఎస్, రంగంపేట పి ఎ సి ఎస్. లలో గోదాముల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను పరిశీలించారు. అలాగే ఎఫ్ ఎస్ సి ఎస్ కోతపల్లి, పి ఎ సి ఎస్ కల్వకుంట పి ఎ సి ఎస్ చీకోడులకు గోదాముల నిర్మాణం కోసం భూ కేటాయింపు అంశంపై చర్చించారు. సంబంధిత శాఖల సమన్వయంతో భూమి కేటాయింపు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు.
ధాన్య నిల్వ గోదాముల నిర్మాణానికి సంబంధించి ఎఫ్‌సీఐ (Food Corporation of India)తో పాటు సంబంధిత సంస్థల అవసరాలు, ధాన్య నిల్వకు ఉన్న డిమాండ్, నిల్వ సామర్థ్యం, భౌగోళిక అనుకూలతలను పరిగణనలోకి తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎఫ్‌సీఐ అధికారులు నిర్వహించే పరిశీలనలో గుర్తించిన అంశాలను పరిగణనలోకి తీసుకుని అవసరమైన ప్రాంతాల్లో గోదాముల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. జిల్లాలో పి ఎ సి ఎస్ లను బలోపేతం చేయడంతో పాటు ధాన్య నిల్వ, సేకరణ, మార్కెటింగ్ కార్యకలాపాలకు అవసరమైన మౌలిక సదుపాయాలను PACS స్థాయిలో అభివృద్ధి చేయాలని కలెక్టర్ తెలిపారు. తద్వారా రైతులకు మరింత మెరుగైన సేవలు, ప్రయోజనాలు అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) అంబదాస్ రాజేశ్వర్, జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్, అదనపు డి ఆర్ డి ఓ సరస్వతి, జెడ్పీ సీఈఓ ఎల్లయ్యతో పాటు కమిటీ సభ్యులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

