A2న్యూస్, జులై 14, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్ జిల్లా (13) ప్రజావాణిలో అందిన ప్రతి ఫిర్యాదుపై చట్టబద్ధంగా, పారదర్శకంగా విచారణ నిర్వహించి బాధితులకు సత్వర న్యాయం అందించాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస్ రావు సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులను ఎస్పీ స్వయంగా స్వీకరించి ఒక్కో అర్జీని క్షుణ్ణంగా పరిశీలించారు. వ్యక్తిగత, కుటుంబ, భూ వివాదాలు, ఆర్థిక మోసాలు, వేధింపులు తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులు ప్రజావాణిలో అందాయి. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రతి ఫిర్యాదుపై నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి, చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో అందిన ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి జాప్యానికి తావు లేకుండా చూడాలని, ప్రతి వినతిదారునికి వారి ఫిర్యాదు పురోగతిపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సూచించారు. ప్రజల సమస్యలను వేగవంతంగా పరిష్కరించడం ద్వారా పోలీసు శాఖపై ప్రజల విశ్వాసం మరింత బలోపేతం అవుతుందని ఎస్పీ పేర్కొన్నారు. బాధితులకు త్వరితగతిన న్యాయం చేయడం, ప్రజలకు నాణ్యమైన పోలీసు సేవలు అందించడం, ప్రజా సమస్యల పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పాటించడం మెదక్ జిల్లా పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎలాంటి భయం లేదా సంకోచం లేకుండా పోలీసులను సంప్రదించాలని, ప్రతి ఫిర్యాదును చట్టపరంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస్ రావు హామీ ఇచ్చారు.

