A2న్యూస్, జులై 14, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము
మెదక్ జిల్లా (13) ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో మహిళలకు సురక్షితమైన, గౌరవప్రదమైన పని వాతావరణాన్ని కల్పించడం ప్రతి సంస్థ బాధ్యత అని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణపై నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లాలో మహిళల రక్షణ కోసం ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాల్లో 235, ప్రైవేట్ సంస్థల్లో 97 అంతర్గత ఫిర్యాదుల కమిటీలు (ICCలు) ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యాలయాల్లో మహిళలపై జరిగే లైంగిక వేధింపులను అరికట్టేందుకు **”మహిళలపై కార్యాలయాల్లో లైంగిక వేధింపుల (నివారణ, నిషేధం మరియు పరిష్కారం) చట్టం–2013 (POSH Act)”ను ప్రతి సంస్థ తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు. 10 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ICC) ఏర్పాటు చేయడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. కమిటీలో మహిళా అధ్యక్షురాలు, ఉద్యోగుల ప్రతినిధులు, మహిళా హక్కుల అంశాల్లో అనుభవం కలిగిన సభ్యుడు ఉండాలని వివరించారు. మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులను పూర్తి గోప్యతతో విచారించి, చట్టం ప్రకారం సకాలంలో పరిష్కరించే బాధ్యత యాజమాన్యంపై ఉంటుందని తెలిపారు. ఉద్యోగులందరికీ POSH చట్టంపై అవగాహన కల్పించేందుకు శిక్షణా కార్యక్రమాలు, అవగాహన సదస్సులు తరచూ నిర్వహించాలని సూచించారు.
ప్రతి మహిళ భయాందోళనలు లేకుండా గౌరవంతో పనిచేసే వాతావరణాన్ని కల్పించడం ప్రతి సంస్థ సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. మహిళల భద్రత, సమానత్వం, గౌరవాన్ని పరిరక్షించేందుకు పోష్ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని పిలుపునిచ్చారు. మహిళలు ఫిర్యాదులు నమోదు చేయడానికి ‘షీ-బాక్స్ (SHe-Box) పోర్టల్’ ను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

