ఆపరేషన్ ముస్కాన్–XIIలో పది రోజుల్లో 34 మంది చిన్నారుల రక్షణ
జిల్లా వ్యాప్తంగా 22 కేసుల నమోదు
ఆర్థిక ఇబ్బందులు ఉన్న చిన్నారులకు ప్రభుత్వ హాస్టళ్లలో ప్రవేశం కల్పిస్తాం: అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్
A2న్యూస్, జులై 11, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్ జిల్లా (10)రాష్ట్రవ్యాప్తంగా జూలై 1 నుంచి చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్–XII కార్యక్రమం మెదక్ జిల్లాలో అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా కొనసాగుతోందని, బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించేందుకు ప్రతి శాఖ సమిష్టిగా కృషి చేయాలని జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని హోటళ్లు, ఇటుక బట్టీలు, నిర్మాణ పనులు, వ్యాపార సముదాయాలు తదితర ప్రాంతాల్లో పనిచేస్తున్న బాల కార్మికులను గుర్తించి వెంటనే రక్షించి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) ముందు హాజరుపరిచి, అనంతరం తల్లిదండ్రులకు లేదా అవసరమైతే సంరక్షణ గృహాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. “పిల్లల చేతుల్లో పనిముట్లు కాదు… పుస్తకాలే ఉండాలి” అని పేర్కొన్న ఆయన, ప్రతి చిన్నారి బాల్యం విద్యకే అంకితం కావాలని, వారి భవిష్యత్ అభివృద్ధి కోసం సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని అన్నారు. చదువుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిన్నారులకు ప్రభుత్వ వసతి గృహాల్లో ప్రవేశం కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఆపరేషన్ ముస్కాన్–XII ప్రారంభమైనప్పటి నుంచి పది రోజుల వ్యవధిలో జిల్లాలో 34 మంది చిన్నారులను రక్షించి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరుపరిచిన అనంతరం వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించి అప్పగించినట్లు తెలిపారు. అలాగే జిల్లా వ్యాప్తంగా బాల కార్మిక వ్యవస్థకు సంబంధించి 22 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. బాల కార్మికులను పనిలో ఉంచుకునే యజమానులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ఆయన, ప్రత్యేక కార్యక్రమం నెల రోజుల పాటు కొనసాగనున్న నేపథ్యంలో అన్ని శాఖలు సమన్వయంతో ప్రతిరోజూ మండలాలు, గ్రామాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి బాల కార్మికులను గుర్తించి తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ జార్జ్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సతేంద్ర ప్రసాద్, విద్యాశాఖ, కార్మికశాఖ అధికారులు, ఎన్‌జీఓ ప్రతినిధులు, అలాగే రెండు డివిజన్‌లకు చెందిన ఆపరేషన్ ముస్కాన్ బృందాలు పాల్గొన్నారు.

