Thursday, July 30, 2026
Homeమెదక్ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణలో డిజిటలైజేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలి – భారత ఎన్నికల సంఘం...

ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణలో డిజిటలైజేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలి – భారత ఎన్నికల సంఘం డిప్యూటీ ఎన్నికల కమిషనర్ పవన్ కుమార్ శర్మ

📰 Generate e-Paper Clip

A2న్యూస్, జులై 11, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ జిల్లా (10) ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని భారత ఎన్నికల సంఘం డిప్యూటీ ఎన్నికల కమిషనర్ పవన్ కుమార్ శర్మ ఆదేశించారు. శుక్రవారం న్యూఢిల్లీ నుంచి ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ కుమార్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, జిల్లా ఎన్నికల అధికారులు, కలెక్టర్లతో ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కుమార్ శర్మ మాట్లాడుతూ ఎన్నికల జాబితాలో పారదర్శకత ప్రజాస్వామ్య బలోపేతానికి అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రతి ఎన్నికకు ముందు ఓటరు జాబితాను నవీకరించడం ఎన్నికల సంఘం బాధ్యత అని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన, సంబంధిత నియోజకవర్గంలో సాధారణ నివాసితులైన, చట్టపరంగా అనర్హులు కాని ప్రతి భారత పౌరుడు ఓటరుగా నమోదు కావడానికి అర్హుడని వివరించారు.ఇంటింటి సర్వేలు, బూత్ స్థాయి అధికారుల (బీఎల్‌వోలు) పనితీరు, ఓటరు జాబితాలో పేర్ల నమోదు, తొలగింపు, సవరణ ప్రక్రియలను అత్యంత ఖచ్చితత్వంతో నిర్వహించాలని సూచించారు. మిగిలిన ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని త్వరితగతిన పూర్తి చేసి, ఈ నెల 24వ తేదీలోగా డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ నిర్ణీత గడువులో ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని తెలిపారు. అర్హులైన ఒక్క ఓటరు కూడా ఓటు హక్కును కోల్పోకుండా, అనర్హులు జాబితాలో చేరకుండా జిల్లా ఎన్నికల అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించిన ప్రతి ఓటరిని ముసాయిదా జాబితాలో చేర్చుతామని, తగిన విచారణ లేకుండా ఏ ఓటరు పేరును కూడా జాబితా నుంచి తొలగించరాదని స్పష్టం చేశారు. దరఖాస్తుదారుల అర్హతను పరిశీలించిన అనంతరం మాత్రమే తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. తుది జాబితా ప్రచురణ తర్వాత ఎవరైనా అసంతృప్తిగా ఉంటే జిల్లా మేజిస్ట్రేట్‌కు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుందని వెల్లడించారు.పోలింగ్ కేంద్రాల క్రమబద్ధీకరణలో భాగంగా ఏ పోలింగ్ కేంద్రంలోనూ 1,200 మందికి మించి ఓటర్లు ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ, ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ 99.6 శాతం పూర్తైందని, డిజిటలైజేషన్ ప్రక్రియ 21.94 శాతం పూర్తైందని తెలిపారు. మిగిలిన ఫారాల పంపిణీని పూర్తిచేసి డిజిటలైజేషన్‌ను మరింత వేగవంతం చేస్తామని పేర్కొన్నారు. మెదక్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహిస్తున్నామని తెలిపారు. మ్యాపింగ్ చేసిన డేటా ఆధారంగా ఎన్యూమరేషన్ ఫారాలను పరిశీలించి డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మెదక్ ఆర్డీవో రమాదేవి, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ గఫార్, ఎన్నికల శాఖ సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!