Wednesday, July 29, 2026
Homeమెదక్భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే భూ రీ-సర్వే లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే భూ రీ-సర్వే లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

📰 Generate e-Paper Clip

భూ భారతి విజయవంతమైన అమలుకు రీ-సర్వే కీలకం – మార్చి 2027 నాటికి మూడు విడతల్లో పూర్తి చేయాలని ఆదేశం

A2న్యూస్, జూలై 12, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ జిల్లా (11) రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు భూ భారతి చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలంటే భూ రీ-సర్వేను అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార–పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భూ రీ-సర్వే, భూ భారతి అమలు, సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, రెండు పడక గదుల ఇళ్ల పంపిణీ, విద్యార్థుల యూనిఫాంల పంపిణీ తదితర అంశాలపై శనివారం ఖమ్మం జిల్లా కలెక్టరేట్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హైదరాబాద్ నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్, సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ పాల్గొన్నారు. మెదక్ జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు కలెక్టర్ నగేష్, ఏడి ల్యాండ్ సర్వే కిషన్ సమావేశంలో పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధరణిని రద్దు చేసి భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చామని, రైతుల భూములకు పూర్తి భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. భూ భారతి అమల్లోకి వచ్చి 15 నెలలు పూర్తయినా ప్రజల అంచనాలను పూర్తిగా అందుకోలేకపోయామని పేర్కొన్నారు. ధరణి కాలంలో పెండింగ్‌లో ఉన్న 9.6 లక్షల సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారం కోసం భూ భారతిలో అవకాశం కల్పించి, హైకోర్టు సమస్యలను కూడా పరిష్కరించినప్పటికీ అధిక సంఖ్యలో దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయనే అభిప్రాయం ఉందన్నారు. తిరస్కరణలకు గల కారణాలను గుర్తించి నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. భూ భారతి సమర్థవంతమైన అమలుకు భూ రీ-సర్వే తప్పనిసరని మేధావుల సూచనల మేరకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. శిక్షణ పొందిన 5,700 మంది లైసెన్స్ సర్వేయర్ల సేవలను వినియోగించుకోవాలని, రెగ్యులర్ సర్వేయర్లు–లైసెన్స్ సర్వేయర్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. లైసెన్స్ సర్వేయర్లకు ఉద్యోగం లేదా రెగ్యులరైజేషన్‌పై ఎలాంటి హామీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. నక్షాలు లేని 413 ప్రాంతాల్లో ఐదు గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా నిర్వహించిన రీ-సర్వేతో 95 శాతం వరకు భూ సమస్యలు పరిష్కారమయ్యాయని తెలిపారు. తొలి విడతలో ప్రతి జిల్లాలో 70 గ్రామాలను ఎంపిక చేసి రీ-సర్వే చేపడుతున్నట్లు చెప్పారు. అవసరమైన ఆధునిక సర్వే పరికరాలను జిల్లా స్థాయిలో కొనుగోలు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. మార్చి-2027 నాటికి మూడు విడతల్లో రాష్ట్రవ్యాప్తంగా రీ-సర్వే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. రీ-సర్వేలో పనిచేసే లైసెన్స్ సర్వేయర్లకు ఎకరానికి రూ.50తో పాటు రవాణా, ఇతర ఖర్చుల కోసం రూ.10 చెల్లించి మొత్తం రూ.60 అందజేస్తామని తెలిపారు. జూలై 28లోపు విధుల్లో చేరని లైసెన్స్ సర్వేయర్ల లైసెన్సులను రద్దు చేయాలని ఆదేశించారు. వారికి బీమా, సామాజిక భద్రత కల్పించనున్నట్లు చెప్పారు. ఒక సర్వే నంబరులో కొంత భూమి మాత్రమే ప్రభుత్వ అవసరాలకు సేకరించినప్పటికీ మొత్తం భూమిని నిషేధిత జాబితాలో ఉంచే సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. సాదాబైనామా దరఖాస్తులను నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించి నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. పాలేరు నియోజకవర్గ ప్రజాదర్బార్‌లో వచ్చిన 6,500 రెవెన్యూ సమస్యల్లో 98 శాతం సమస్యలకు భూ రీ-సర్వేతో శాశ్వత పరిష్కారం లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల తొలి విడత నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని, పెండింగ్‌లో ఉన్న రెండు పడక గదుల ఇళ్లను ప్రస్తుత స్థితిలోనే లబ్ధిదారులకు అప్పగించాలని అధికారులకు ఆదేశించారు. నిధులు విడుదలైనా పనులు ప్రారంభించని చోట బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయాలని హెచ్చరించారు. రెండో విడత లబ్ధిదారుల ఎంపికను త్వరగా పూర్తి చేసి గుడిసెల్లో నివసించే కుటుంబాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్ మాట్లాడుతూ తొలి విడతలో ఎంపిక చేసిన 70 గ్రామాల్లో రీ-సర్వేను నవంబర్‌లోపు పూర్తి చేసి, రెండో విడతలో మరో 70 గ్రామాల్లో మార్చి-2027లోపు పూర్తి చేయాలని తెలిపారు. తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 41 వేల గుడిసెలను గుర్తించామని, అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. తొలి విడత నిర్మాణాలను వేగవంతం చేసి ఆగస్టు నాటికి రెండు లక్షల ఇళ్ల లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల విద్యార్థుల యూనిఫాంలను స్వయం సహాయక సంఘాల మహిళా టైలర్లతో కుట్టిస్తున్నామని తెలిపారు. జూలై 15లోపు బాలికలకు, జూలై 30లోపు బాలురకు యూనిఫాంలు పంపిణీ పూర్తి చేసి, ఆగస్టు 15 నాటికి ప్రతి విద్యార్థికి కనీసం ఒక జత యూనిఫాం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!