పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్
A2 న్యూస్, జూన్ 22, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్ (21)జిల్లాలో నిర్వహిస్తున్న నీట్ (యు బి)-2026 రీ-ఎగ్జామినేషన్ సందర్భంగా మెదక్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రాన్ని జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లు, పోలీసు బందోబస్తు, అభ్యర్థుల ప్రవేశ ప్రక్రియలను ఆయన సమీక్షించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ, అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రం పరిసర ప్రాంతాల్లో భారతీయ నాగరిక సురక్షా సంహిత (బి ఎన్ ఎస్ ఎస్) సెక్షన్–163 అమల్లో ఉన్నందున ఎవరూ గుంపులుగా నిలబడవద్దని, అనవసర రద్దీ సృష్టించకుండా పోలీసులకు సహకరించాలని సూచించారు. పరీక్షల నిర్వహణలో పాల్గొంటున్న పోలీసు అధికారులు, సిబ్బంది పూర్తి అప్రమత్తతతో విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. అలాగే పరీక్షా పత్రాలు పరీక్షా కేంద్రాల నుంచి స్ట్రాంగ్‌రూమ్‌కు భద్రంగా చేరే వరకు నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. పరీక్షల పారదర్శకత, భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని స్పష్టం చేశారు. జిల్లాలో అభ్యర్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాస్తున్నారని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందని తెలిపారు. పరీక్షల విజయవంతమైన నిర్వహణకు అభ్యర్థులు, తల్లిదండ్రులు, ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

