A2న్యూస్, జులై 1, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
శివంపేట(,30) భూ యజమానుల హక్కులను పక్కాగా పరిరక్షించి, భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూ రీ సర్వే కార్యక్రమాన్ని చేపట్టిందని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. మంగళవారం శివంపేట మండలంలోని బీక్యాతాండలో ల్యాండ్ సర్వే శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన భూభారతి భూముల రీ సర్వే గ్రామసభలో అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీవో, సర్వే శాఖ అధికారులు, ఎంపీడీవో, గ్రామ సర్పంచ్‌తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, శివంపేట మండలంలో చివరిసారిగా 1946 సంవత్సరంలో భూ సర్వే నిర్వహించారని, అప్పటి నుంచి భూముల క్రయవిక్రయాలు, విభజనలు జరిగినప్పటికీ భూ మ్యాపులు తగిన విధంగా నవీకరించబడలేదని తెలిపారు. దీంతో అనేక భూ సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు.
గ్రామాల్లోని భూ నక్షాల్లో ఉన్న లోపాలను గుర్తించి పరిష్కరించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని చెప్పారు. రీ సర్వేను పకడ్బందీగా అమలు చేసి ప్రతి భూ కమతాన్ని ఆన్‌లైన్ డిజిటలైజేషన్‌లో నమోదు చేయడంతో పాటు ప్రతి భూమికి భూధార్ అందజేస్తామని తెలిపారు. దీనివల్ల భూ వివాదాలు తగ్గి, రైతులకు శాశ్వత భూ హక్కులు కల్పించబడతాయని చెప్పారు.అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ, గ్రామాల్లో భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం భూ రీ సర్వే కార్యక్రమాన్ని చేపట్టిందని వివరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ల్యాండ్ సర్వే అధికారి ఎ. కిషన్, సంబంధిత శాఖల అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

