A2 న్యూస్, జులై 1, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
నర్సాపూర్ (30) రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. మంగళవారం నర్సాపూర్ మండలం లింగాపూర్ గ్రామంలోని రైతు వేదికలో నిర్వహించిన రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమాన్ని రైతులతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ వర్చువల్‌గా వీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్, తహసీల్దార్ శ్రీనివాస్, వ్యవసాయ శాఖ అధికారులు, ఏఈవోలు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఇటీవల విత్తన మేళాలు నిర్వహించి రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టిందన్నారు. రైతుల అభివృద్ధి, వ్యవసాయ రంగ బలోపేతమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను విడుదల చేశారు. ప్రతి ఎకరానికి రూ.12,000 చొప్పున పంట పెట్టుబడి సాయాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొని ప్రసంగించారు.
అనంతరం రైతులకు ఎల్‌నినో ప్రభావం, పంటల మార్పిడి, వాతావరణ పరిస్థితులకు అనుగుణమైన సాగు విధానాలు, ఆయిల్ పామ్ పంట నిర్వహణ తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్, ఏడీఏ సంధ్య, ఏవో దీపిక, టెక్నికల్ అసిస్టెంట్ శ్రీదేవి, వ్యవసాయ విస్తరణ అధికారులు, గ్రామ సర్పంచ్, ప్రజాప్రతినిధులు, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

