క్రీడలతో పోటీతత్వం, క్రమశిక్షణ అలవడతాయి: డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసరావు
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 25:
మెదక్ జిల్లా (24) ఆటలు గెలుపోటములను సమానంగా స్వీకరించే లక్షణాన్ని నేర్పిస్తాయని, క్రీడలు విద్యార్థుల్లో పోటీతత్వంతో పాటు క్రమశిక్షణను పెంపొందిస్తాయని డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసరావు అన్నారు. క్రీడలను ఆసరాగా చేసుకుని విద్యార్థులు తమ లక్ష్యాలను చేరుకోవడంతో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. మెదక్ పట్టణంలోని వెస్లీ గ్రౌండ్‌లో గురువారం నిర్వహించిన బాలికల అండర్–14, అండర్–17 జిల్లాస్థాయి కబడ్డీ క్రీడా పోటీలకు మెదక్ జిల్లా విద్యాధికారి రాజు, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రతి క్రీడాకారుడు మండల స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. చదువుతో పాటు క్రీడలకు కూడా విద్యార్థులు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా శారీరక దారుఢ్యం, మానసిక ఉల్లాసం కోసం క్రీడల్లో చురుకుగా పాల్గొనాలని అన్నారు. పాఠశాలల్లో విద్యార్థులు వ్యాయామ ఉపాధ్యాయులను ఎక్కువగా ఇష్టపడతారని పేర్కొన్నారు. జిల్లా విద్యాధికారి రాజు మాట్లాడుతూ.. మెదక్ జిల్లాలో వాలీబాల్, ఖోఖో, కబడ్డీ తదితర క్రీడా పోటీలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహిస్తున్న ఎస్‌జీఎఫ్ సెక్రటరీ నాగరాజు, వ్యాయామ ఉపాధ్యాయులను అభినందించారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు.
మెదక్ జిల్లాను టూరిజం హబ్‌గా అభివృద్ధి చేయడమే లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ నెల 27న నిర్వహించనున్న ప్రపంచ పర్యాటక దినోత్సవ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని వ్యాయామ ఉపాధ్యాయులు కూడా భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్ సెక్రటరీ నాగరాజు, డీవైఎస్‌ఓ రమేష్, పీఈటీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నాగరాజు, టీజీపీఈటీ అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, సీనియర్ పీడీ మాధవరెడ్డి, శ్రీకాంత్‌గౌడ్, రవి, లతీఫా, జిల్లాకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

