Saturday, September 12, 2026
Homeమెదక్గణేష్ మండపాల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి

గణేష్ మండపాల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి

📰 Generate e-Paper Clip

భద్రత, బందోబస్తు ఏర్పాట్లకు ముందస్తు సమాచారం తప్పనిసరి

మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 9:

మెదక్ జిల్లా (8) గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు సూచించారు. గణేష్ మండపాల నిర్వాహకులు పోలీసు శాఖ రూపొందించిన ఆన్‌లైన్ పోర్టల్‌లో మండపాలకు సంబంధించిన పూర్తి వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని తెలిపారు. మండపాల వివరాలను ముందుగానే పోలీసులకు తెలియజేయడం ద్వారా భద్రత, బందోబస్తు ఏర్పాట్లను సులభతరం చేయవచ్చని ఎస్పీ పేర్కొన్నారు. ఆన్‌లైన్ ఇంటిమేషన్ నమోదుకు ఎలాంటి రుసుము లేదని తెలిపారు. నిర్వాహకులు కంప్యూటర్ లేదా మొబైల్ ద్వారా http://policeportal.tspolice.gov.in/index.htm వెబ్‌సైట్‌లో వివరాలను నమోదు చేసి, దరఖాస్తును సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో అందజేయాలని సూచించారు. గణేష్ మండపాలను ఏర్పాటు చేసే సమయంలో ప్రజా రవాణాకు, అత్యవసర వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. ప్రతి మండపం వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు, 24 గంటలు వాలంటీర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అగ్ని ప్రమాదాల నివారణకు మండపాల వద్ద ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు, నీటి డ్రమ్ములు, ఇసుకను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. మండపాలు, శోభాయాత్రల్లో డీజేలు, టపాసుల వినియోగానికి దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. ఇతరుల మనోభావాలను కించపరిచే విధంగా నినాదాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయరాదని సూచించారు. రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లను వినియోగించాలని ఎస్పీ తెలిపారు. మండపాల వద్ద అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే డయల్ 112కు లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. గణేష్ ఉత్సవాలను ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరిస్తూ శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!