– ఎస్‌జీఎఫ్ వెబ్‌సైట్ పోర్టల్ ఆవిష్కరించిన అదనపు కలెక్టర్ నగేష్
A2న్యూస్, జులై 16, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్ జిల్లా (15) జిల్లాలో క్రీడా స్ఫూర్తి ప్రతిబింబించేలా సెప్టెంబర్ తొలి వారంలో నిర్వహించే జిల్లా స్థాయి క్రీడా పోటీలను విజయవంతం చేసేందుకు వ్యాయామ ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు. జిల్లా విద్యాధికారి అధ్యక్షతన బుధవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య (ఎస్‌జీఎఫ్) సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, యువజన క్రీడల అధికారి రమేష్, అకాడమిక్ మానిటరింగ్ అధికారి సుదర్శనమూర్తి, జిల్లాలోని పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ, ఆగస్టు 25లోపు మండల స్థాయి క్రీడా పోటీలను పూర్తి చేసి, అనంతరం సెప్టెంబర్ తొలి వారం నుంచి జిల్లా స్థాయి పోటీలను ప్రారంభించాలని సూచించారు. పోటీల నిర్వహణలో నాణ్యత, సమయపాలనకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసి పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన ఎస్‌జీఎఫ్ క్రీడాకారులకు డ్రెస్సుల పంపిణీ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి అవసరమైన చర్యలు చేపట్టేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం అదనపు కలెక్టర్ ఎస్‌జీఎఫ్ వెబ్‌సైట్ పోర్టల్‌ను ఆవిష్కరించారు. ఈ ఆన్‌లైన్ పోర్టల్‌లో క్రీడాకారులకు సంబంధించిన కీలక సమాచారం, మెదక్ జిల్లా నుంచి ప్రతిభ కనబర్చిన క్రీడాకారుల వివరాలు, జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలు, పథకాలకు సంబంధించిన సమగ్ర సమాచారం అందుబాటులో ఉంటుందని తెలిపారు. క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకునేందుకు ఈ పోర్టల్ ఉపయోగకరమైన వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు.
అంతకుముందు జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య (ఎస్‌జీఎఫ్) కార్యనిర్వాహక కార్యదర్శి ఆర్. నాగరాజు మాట్లాడుతూ, గత విద్యా సంవత్సరంలో జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో 4,150 మంది విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. వారిలో 192 మంది రాష్ట్ర స్థాయికి, 16 మంది జాతీయ స్థాయికి ఎంపికై జిల్లాకు గుర్తింపు తీసుకొచ్చారని వివరించారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ మానిటరింగ్ అధికారి సుదర్శనమూర్తి, పీఈటీల సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎస్. నాగరాజు, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి మధు, శ్రీధర్ రెడ్డి, మాధవరెడ్డి, శ్యామ్, రూపేందర్ తదితరులు పాల్గొన్నారు.

