A2న్యూస్, జులై 12, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మనోహరాబాద్ (11) విద్యార్థుల్లో భద్రతపై అవగాహన పెంపొందించి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచే లక్ష్యంతో మెదక్ జిల్లా పోలీసు శాఖ చేపట్టిన ‘పోలీస్ అక్క’ కార్యక్రమం కింద మనోహరాబాద్ పోలీస్ స్టేషన్‌కు చెందిన మహిళా పోలీసు కానిస్టేబుల్ తస్లీమా స్థానిక జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యక్తిగత భద్రత, గుడ్ టచ్–బ్యాడ్ టచ్ గుర్తింపు, సైబర్ నేరాల నుంచి రక్షణ, సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించే విధానం, మాదకద్రవ్యాల దుష్పరిణామాలు, అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరంపై ఆమె వివరించారు. అలాగే పాఠశాల, ఇల్లు లేదా ఇతర ప్రాంతాల్లో ఎలాంటి వేధింపులు, బెదిరింపులు లేదా అనుమానాస్పద పరిస్థితులు ఎదురైనా భయపడకుండా వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. విద్యార్థుల భద్రతకు పోలీసులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని, సహాయం అవసరమైన ప్రతి సందర్భంలో నిర్భయంగా ‘పోలీస్ అక్క’ లేదా సమీప పోలీసు సిబ్బందిని సంప్రదించాలని తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పలు సందేహాలను అడిగి నివృత్తి చేసుకోగా, ఇటువంటి అవగాహన కార్యక్రమాలు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమని ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు.

