తహసీల్దారులకు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశం
A2న్యూస్, జులై 2, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్ జిల్లా (1) పారదర్శకతతో కూడిన రెవెన్యూ పాలనను లక్ష్యంగా పెట్టుకుని జవాబుదారీతనంతో వ్యవహరిస్తూ ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ జిల్లా తహసీల్దారులను ఆదేశించారు.బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్ నగేష్, డీఆర్ఓ అంబదాస్ రాజేశ్వర్, నర్సాపూర్, తూప్రాన్ ఆర్డీవోలు, అన్ని మండలాల తహసీల్దారులతో కలిసి భూ భారతి పెండింగ్ దరఖాస్తులు, ప్రజావాణి అర్జీలు, రెవెన్యూ పాలనపై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా డివిజన్, మండలాల వారీగా భూ భారతి, సాదా బైనామా దరఖాస్తుల పురోగతిపై కలెక్టర్ ఆరా తీశారు. భూ భారతి పోర్టల్ ద్వారా వచ్చే దరఖాస్తులను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.పట్టాదారు పాస్ పుస్తకాలు, నమోదైన వివరాలు, వారసత్వ హక్కుల నమోదు, సర్వే నంబర్ల వారీగా భూ వివరాల ధృవీకరణ తదితర అంశాలను నిబంధనల మేరకు పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
భూ భారతి కార్యక్రమం అమలు పురోగతి, భూ రికార్డుల పరిశీలన, ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ప్రభుత్వ అవసరాలు, అభివృద్ధి పనులకు సంబంధించిన భూ సేకరణలో నిబంధనలు పాటిస్తూ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.సాదా బైనామా దరఖాస్తులను జాప్యం చేయకుండా సంబంధిత పత్రాలు, గ్రామ రికార్డులు, ఇతర ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే ప్రజావాణిలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను సత్వరమే పరిష్కరించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని తహసీల్దారులకు సూచించారు.ఈ సమీక్ష సమావేశంలో సంబంధిత రెవెన్యూ అధికారులు, తహసీల్దారులు పాల్గొన్నారు.

