A2న్యూస్, జులై 24, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్ జిల్లా (23) భూభారతి కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న భూముల రీ-సర్వేతో భూ సంబంధిత సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. గురువారం మెదక్ మండలం కోమటూరు గ్రామంలో నిర్వహించిన భూభారతి భూముల రీ-సర్వే గ్రామసభలో అదనపు కలెక్టర్ నగేష్, మెదక్ ఆర్డీవో రమాదేవి, ఏడి ల్యాండ్ సర్వే కిషన్, రైతులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఏళ్ల తరబడి మోకాపై సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న నిజమైన రైతులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని చెప్పారు. అక్రమంగా పట్టాలు పొంది ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందుతున్న వారి పట్టాలను రద్దు చేసేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన భూ సంబంధిత దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, రికార్డులను పరిశీలించిన అనంతరం ప్రభుత్వ నిబంధనల మేరకు పరిష్కరిస్తామని తెలిపారు. భూ రికార్డులు, మోకా, పట్టాదారుల వివరాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని పారదర్శకంగా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ముందుగా గ్రామంలోని భూముల హద్దులను ఖరారు చేయడం ద్వారా భూములపై స్పష్టత ఏర్పడటంతో పాటు ప్రభుత్వ భూముల పరిరక్షణ కూడా సాధ్యమవుతుందని తెలిపారు. పట్టా ఉండి మోకాపై లేని వారు, మోకాపై ఉండి పట్టా లేని వారి సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన కలెక్టర్, సర్వేయర్లు, రెవెన్యూ అధికారులు, ప్రజల సహకారంతో రీ-సర్వే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి భూ సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.

