Friday, August 7, 2026
Homeమెదక్భూభారతి పెండింగ్ దరఖాస్తులపై దృష్టి సారించాలి పారదర్శక రెవెన్యూ పాలన లక్ష్యంగా అధికారులు పనిచేయాలి

భూభారతి పెండింగ్ దరఖాస్తులపై దృష్టి సారించాలి పారదర్శక రెవెన్యూ పాలన లక్ష్యంగా అధికారులు పనిచేయాలి

📰 Generate e-Paper Clip

విద్యార్థినుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి

కేజీబీవీలు పరిశుభ్రతకు నిలయాలుగా మారాలి

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 7:

పెద్ద శంకరంపేట (6) భూభారతి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, పారదర్శక రెవెన్యూ పాలన లక్ష్యంగా అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. అలాగే కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీలు) పరిశుభ్రతకు ఆదర్శంగా నిలవాలని, విద్యార్థినుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గురువారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా కలెక్టర్ పెద్ద శంకరంపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. తొలుత తహసీల్దార్ కార్యాలయంలో భూభారతి, రెవెన్యూ సదస్సుల ద్వారా అందిన పెండింగ్ దరఖాస్తులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం, భూభారతి దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేసి, మీ సేవలో వచ్చిన దరఖాస్తులు పెండింగ్‌లో లేకుండా సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ పాఠశాలలోని వంటశాల, తాగునీటి సౌకర్యాలు, తరగతి గదులు, మరుగుదొడ్లు, పరిశుభ్రత తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థినులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసి ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలపై అధికారులను ఆరా తీశారు.విద్యార్థినులతో ఆత్మీయంగా మాట్లాడిన కలెక్టర్ వారికి అందుతున్న విద్య, వసతి, ఆహారం, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలపై వివరాలు తెలుసుకున్నారు. నాణ్యమైన విద్యతో పాటు ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. పాఠశాలలో పరిశుభ్రత, ఆహార నాణ్యత, విద్యార్థినుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. అలాగే తరగతి గదుల్లో విద్యార్థినుల అభ్యాస సామర్థ్యాలను పరీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆరోగ్యం, పోషణ దృష్ట్యా నిర్దేశించిన మెనూ ప్రకారం పోషకాహారాన్ని సకాలంలో అందించాలని సూచించారు. తదుపరి బుజ్రాన్‌పల్లి గ్రామపంచాయతీ ఆవరణలో మొక్కలు నాటి, నూతనంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇంటి వద్ద ఇంకుడు గుంత నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వన మహోత్సవం సందర్భంగా నిర్దేశించిన మొక్కల నాటే లక్ష్యాలను పూర్తి చేసి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేసి లబ్ధిదారులు సొంతింటి కలను సాకారం చేసుకోవాలని సూచించారు. ఇంకుడు గుంతల నిర్మాణం ద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయని, వాటి ఉపయోగాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నారాయణ, ఎంపీడీవో క్రాంతికుమార్, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!