A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 13:
మెదక్ జిల్లా (12)రాష్ట్రస్థాయి అండర్–17 బాలికల సుబ్రతో ముఖర్జీ ఫుట్‌బాల్ కప్ పోటీల్లో మెదక్ జిల్లా బాలికల జట్టు సత్తాచాటింది. పాఠశాల క్రీడా సమాఖ్య తెలంగాణ ఆధ్వర్యంలో ఈ నెల 8, 9 తేదీల్లో మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లాలోని తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్‌లో నిర్వహించిన పోటీల్లో మెదక్ జట్టు ద్వితీయ స్థానం సాధించింది. ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి ఎస్. రాజు, పాఠశాల క్రీడా సమాఖ్య కార్యనిర్వాహక కార్యదర్శి ఆర్. నాగరాజు ఆధ్వర్యంలో బాలికల జట్టు జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా కలెక్టర్ చేతుల మీదుగా జట్టుకు రన్నర్ కప్‌తో పాటు మెడల్స్ అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారులకు 2 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. క్రీడాకారులకు రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉందని పేర్కొంటూ, రాష్ట్రస్థాయి విజయంతో ఆగిపోకుండా జాతీయ స్థాయిలోనూ రాణించి మెదక్ జిల్లాకు, తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని బాలికలకు సూచించారు. పాఠశాల క్రీడా సమాఖ్య కార్యనిర్వాహక కార్యదర్శి ఆర్. నాగరాజు మాట్లాడుతూ లక్ష్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో, శిక్షకుడు వినయ్ కుమార్ నేతృత్వంలో మెదక్ పట్టణంలోని స్టేడియంలో బాలికలకు ప్రతిరోజూ ఫుట్‌బాల్‌లో శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. నిరంతర శిక్షణ, క్రీడాకారుల కృషి ఫలితంగానే రాష్ట్రస్థాయి పోటీల్లో మెదక్ బాలికలు ప్రతిభ కనబరిచి ద్వితీయ స్థానం సాధించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో (టీ జి ఎస్ డబ్ల్యూ ఆర్ ఎస్) పాఠశాల ప్రిన్సిపాల్ తారా సింగ్ పాల్గొన్నారు. బాలికల జట్టు సాధించిన విజయంపై క్రీడాభిమానులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.

