5 వేల జరిమానా విధించిన మెదక్ జిల్లా న్యాయస్థానం
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 25:
మెదక్ జిల్లా (24) మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తిని హత్య చేసిన కేసులో నిందితుడికి జీవిత ఖైదుతో పాటు 5 వేల జరిమానా విధిస్తూ మెదక్ జిల్లా న్యాయస్థానం తీర్పు వెలువరించింది. నిందితుడికి శిక్ష పడేలా పకడ్బందీగా దర్యాప్తు చేపట్టి, సాక్ష్యాధారాలను కోర్టులో సమర్పించిన పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు అభినందించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుల్కల్ మండలం పోచారం గ్రామానికి చెందిన లక్ష్మణ్ సుమారు 14 ఏళ్ల క్రితం గడిపెద్దాపూర్ గ్రామానికి చెందిన మల్లేశ్వరిని వివాహం చేసుకుని ఇల్లరికం వచ్చాడు. వీరికి అభిలాష్, కార్తీక్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే మద్యానికి బానిసైన లక్ష్మణ్ తరచూ భార్య, కుటుంబ సభ్యులను వేధించడంతో 2023లో కుటుంబ సభ్యులు అతడిని ఇంటి నుంచి బయటకు పంపించారు. ఈ క్రమంలో 2025 సెప్టెంబర్ 30న లక్ష్మణ్ గడిపెద్దాపూర్ గ్రామానికి వచ్చినట్లు కుటుంబ సభ్యులకు తెలిసింది. అదే రోజు రాత్రి పుట్టి ఆంజనేయులుతో కలిసి లక్ష్మణ్ మద్యం సేవించాడు. అనంతరం మద్యం మత్తులో ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆంజనేయులు లక్ష్మణ్‌పై దాడి చేయడంతో అతడు మృతి చెందాడు. అనంతరం మృతదేహాన్ని బయట పడేసి నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. మృతుడి భార్య మల్లేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అల్లాదుర్గ్ పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ శంకర్ 2025 అక్టోబర్ 1న కేసు నమోదు చేశారు. అల్లాదుర్గ్ సీఐ రేణుక రెడ్డి సమగ్ర దర్యాప్తు చేపట్టి, కీలకమైన సాక్ష్యాధారాలను సేకరించి కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. కేసు విచారణ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకటేష్ బలమైన వాదనలు వినిపించారు. సాక్ష్యాధారాలు, ఇరుపక్షాల వాదనలు పరిశీలించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ.. నిందితుడు పుట్టి ఆంజనేయులు దోషిగా నిర్ధారిస్తూ జీవిత ఖైదుతో పాటు రూ.5 వేల జరిమానా విధించారు. ఈ కేసులో కోర్టు లైజనింగ్ అధికారి ఎస్‌ఐ విఠల్, కానిస్టేబుల్ రవీందర్ గౌడ్, సీడీఓ అర్షద్ సహకరించారు. నిందితుడికి శిక్ష పడేలా సమర్థవంతంగా విధులు నిర్వహించిన పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు ప్రత్యేకంగా అభినందించారు

