నేరాల నియంత్రణకు ప్రత్యేక నిఘా.. రాత్రి వేళల్లో పెట్రోలింగ్ ముమ్మరం చేయాలి
మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 25:
మెదక్ జిల్లా (24) పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం అందించాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని వివిధ విభాగాలను పరిశీలించిన ఎస్పీ.. నమోదైన కేసులు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, స్టేషన్ రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరుపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసులను నిర్దిష్ట కాలవ్యవధిలో పూర్తి చేయాలని సూచించారు. ప్రతి కేసులో ఆధారాలను శాస్త్రీయ పద్ధతిలో సేకరించి, నిందితులకు శిక్ష పడే విధంగా నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు. దర్యాప్తులో ఎలాంటి అలసత్వానికి తావులేకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు.
ఫిర్యాదులపై నిష్పక్షపాతంగా విచారణ
ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును బాధ్యతగా స్వీకరించి, చట్టబద్ధంగా, నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని ఎస్పీ సూచించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజలతో మర్యాదగా వ్యవహరిస్తూ, వారి సమస్యలను సానుభూతితో విని పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మెరుగైన పోలీసు సేవలు అందించాలని స్పష్టం చేశారు.
నేరాల నియంత్రణకు ప్రత్యేక నిఘా
మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు. రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ను మరింత ముమ్మరం చేసి, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, పేకాటతో పాటు ఇతర అసాంఘిక, అక్రమ కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ తెలిపారు. క్రమశిక్షణ, సమయపాలనతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన పోలీసింగ్ అందించాలని సూచించారు. ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ పోలీసులపై ప్రజల నమ్మకాన్ని మరింత పెంచేలా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఎస్పీ వెంట డీఎస్పీ ప్రసన్న కుమార్, సీఐలు మహేష్, రాజశేఖర్ రెడ్డి, సందీప్ రెడ్డి, ఎస్‌ఐ సుమన్‌తో పాటు పోలీసు సిబ్బంది ఉన్నారు.

