A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (డెస్క్ విభాగం) సెప్టెంబర్ 5:
హెడ్డింగ్ చూసి ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు మీరు చదువుతుంది నిజమే. ఇటీవల నార్వే దేశంలోని అత్యంత శీతల ప్రాంతమైన స్వాల్ బార్డ్ ద్వీప సమూహంలో జరిగిన వాస్తవ సంఘటన ఇది. ఉత్తర ధ్రువానికి 620 మైళ్ళ దూరంలో ఉన్న స్వాల్ బార్డ్ ప్రాంతంలోని సముద్ర మార్గంలో ఓ టూరిస్ట్ పడవ ప్రయాణిస్తుండగా తీరంలో ఒక ధ్రువపు ఎలుగుబంటి నిద్రిస్తుండగా పడవలో ఉన్న వ్యక్తి కావాలని గట్టిగా హారన్ మోగించగా అది కాస్త ఉలిక్కిపడి అక్కడ నుండి మరోచోటికి వెళ్లిపోయింది. ఆర్కిటిక్ వాతావరణంలో జీవించే ఈ జీవికి ఇలాంటి ఆటంకం కలిగించడం ఆ దేశంలో ఘోరమైన నేరంగా పరిగణించబడుతుంది. స్వాల్ బార్డ్ ఎన్విరాన్మెంట్ యాక్టివ్ సెక్షన్ 30 ఏ ప్రకారం వన్యప్రాణులను భయపెట్టడం, ఆకర్షించడం అక్కడ తీవ్రమైన నేరం. ఈ విషయాన్ని గమనించిన ఇతర తోటి ప్రయాణికులు స్వాల్ బార్డ్ గవర్నర్ అధికారులకు ఫిర్యాదు చేయగా వారు వెంటనే స్పందించి ఆ వ్యక్తికి ఏకంగా 50వేల నార్వేజియన్ క్రోనర్ అంటే మన దేశ కరెన్సీలో చెప్పాలంటే 4.4 లక్షల రూపాయల జరిమానా విధించారు. మూగజీవాల హక్కులను కాపాడడంలో నార్వే ఆఫీసర్ తీసుకున్న తక్షణ చర్య, చట్టాలను పకడ్బందీగా అమలు చేయడంలో వాళ్ళు చూపిన చొరవ నిజంగా అద్భుతం. మనుషులకు అయినా జంతువులకైనా ఈ భూమి మీద స్వేచ్ఛగా సమానంగా బతికే హక్కు ఉందని చెప్పకనే చెబుతుంది.

