A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) అక్టోబర్ 4:
నర్సాపూర్ (3) నీళ్లు లేక ఎండిపోతున్న వరి పంటను చూసి మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు చలించిపోయారు. శనివారం నర్సాపూర్ నియోజకవర్గ పర్యటనలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి తో కలిసి వెళుతుండగా కాగజ్ మద్దూర్ గ్రామంలో మార్గం మధ్యలో కరెంటు లేక ఎండిపోతున్న వరి పొలాలను చూసి పొలంలోకి వెళ్లి అక్కడున్న మహిళా రైతు నాగమణితో మాట్లాడి ఆమె కష్టాలనుఅడిగితెలుసుకున్నారు. మహిళా రైతు నాగమణి హరీశ్ రావు ముందు తన ఆవేదనను వెళ్లగక్కింది. బోర్లలో నీళ్లున్నా కరెంటు రాక పంటలు కళ్లెదుటే ఎండిపోతున్నాయని వాపోయింది. సుమారు 60 వేల రూపాయల పెట్టుబడి పెట్టి మూడు ఎకరాల్లో వరి నాట్లు వేస్తే.. అందులో సగం పొలం పూర్తిగా ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది.నెల రోజుల్లోనే మూడుసార్లు ట్రాన్స్ ఫార్మర్ కాలిపోయిందని, రిపేర్ కోసం ఒక్కోసారి నాలుగు రోజుల పాటు కరెంటు లేక పొలాలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది. నాగమ్మ ఒక్కరిదే కాదు, ఆ ప్రాంతంలోని రైతులందరి పరిస్థితి ఇలాగే కరెంటు లేక కాలిపోతోందని తెలుసుకున్న హరీశ్ రావు రైతుల పరిస్థితి చూసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

