తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించాలి: కార్మిక, గనుల భూగర్భ శాఖ మంత్రి, మెదక్ ఇంచార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 27:
మెదక్ జిల్లా (26) రైతులు ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించాలని కార్మిక, గనుల భూగర్భ శాఖ మంత్రి, మెదక్ ఇంచార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. శనివారం మెదక్ పట్టణంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం, నూతన సాగు పద్ధతులు, అధిక దిగుబడులు సాధించే విధానాలపై అవగాహన కల్పించేందుకు కిసాన్ మేళాను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి వివేక్ వెంకటస్వామితో పాటు మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు హాజరయ్యారు. కిసాన్ మేళాలో రైతులకు నాణ్యమైన విత్తనాల ఎంపిక, సమగ్ర పోషక యాజమాన్యం, సమగ్ర సస్యరక్షణ, నీటి పొదుపు పద్ధతులు, వ్యవసాయ యాంత్రీకరణ, ప్రకృతి వ్యవసాయం, పంటల వైవిధ్యీకరణ తదితర అంశాలపై వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయంలో వినియోగించుకోవడంతో పాటు, పండించిన పంటలకు మెరుగైన మార్కెటింగ్ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను రైతులు వినియోగించుకోవాలని కోరారు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం రైతుల పక్షపాతిగా పనిచేస్తోందని, రైతాంగ సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. రైతులు ఆధునిక సాంకేతిక విధానాలను వ్యవసాయంలో అవలంబించడం ద్వారా అధిక దిగుబడులతో పాటు మెరుగైన లాభాలను పొందవచ్చని పేర్కొన్నారు.
కిసాన్ మేళాలో వివిధ వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్ పి ఓ లు) వ్యవసాయ యాంత్రీకరణ సంస్థలు, విత్తనాలు, ఎరువుల సంస్థల ప్రతినిధులు పాల్గొని రైతులకు అవసరమైన సాంకేతిక, వ్యవసాయ సమాచారం అందించారు. 
ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురాగా, వాటిని పరిశీలించి తగిన పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్, మున్సిపల్ చైర్పర్సన్ రాధిక భూపతి రాజు, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, ఏడీ శ్రీధర్ రాజశేఖర్, డిప్యూటీ డైరెక్టర్ చంద్రశేఖర్, వ్యవసాయ శాస్త్రవేత్తలు సతీష్, సాంబాజి దత్తాత్రేయ నాల్కర్, ప్రొఫెసర్ నిర్మల, రాఘవేంద్ర, ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.

