వాగులు, చెరువుల వద్దకు వెళ్లొద్దు.. తెగిన విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలి
వాహనదారులు నెమ్మదిగా ప్రయాణించాలి: ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) జులై 30:
మెదక్ జిల్లా (29) జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితులు మినహా వర్షాల సమయంలో బయటకు వెళ్లకుండా ఉండాలని, ఒకవేళ ప్రయాణం తప్పనిసరి అయితే వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అత్యంత జాగ్రత్తగా ప్రయాణించాలని సూచించారు. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, కాలువలు, చెరువులు, నదుల్లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ దిగవద్దని హెచ్చరించారు. నీటిలో మునిగిన కల్వర్టులు, వంతెనలు, వాగులను దాటేందుకు ప్రయత్నించవద్దన్నారు. చేపల వేట కోసం నీటి వనరుల వద్దకు వెళ్లరాదని, సెల్ఫీలు లేదా రీల్స్ కోసం వరద ప్రాంతాలు, వాగుల వద్దకు వెళ్లి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుకోవద్దని సూచించారు. పశువులను మేతకు తీసుకెళ్లే వారు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరారు. తడిసిన విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన విద్యుత్ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్లకు దూరంగా ఉండాలని ఎస్పీ తెలిపారు. ప్రమాదకర పరిస్థితులు కనిపిస్తే వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. రైతులు వ్యవసాయ పనులకు వెళ్లే సమయంలో నీటి ప్రవాహాలు, విద్యుత్ మోటార్లు, తీగల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో పొలాల్లో ఉండకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసించవద్దని, ఈదురుగాలులు, వర్షం సమయంలో చెట్ల కింద ఆశ్రయం పొందరాదని ఎస్పీ పేర్కొన్నారు. వర్షాల కారణంగా రోడ్లు జారుడుగా మారడంతో పాటు దృశ్యమానత తగ్గే అవకాశం ఉన్నందున వాహనదారులు అతివేగాన్ని నివారించి నెమ్మదిగా ప్రయాణించాలని సూచించారు. వాహనాల హెడ్‌లైట్లు, బ్రేకులు, వైపర్లు సక్రమంగా పనిచేస్తున్నాయో ముందుగానే తనిఖీ చేసుకోవాలని, వాహనాల మధ్య సురక్షిత దూరం పాటించాలని సూచించారు. అత్యవసరం కాని దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిదని పేర్కొన్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే వెంటనే పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించాలని ఎస్పీ కోరారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండి, అధికారులు సూచించే భద్రతా చర్యలను తప్పనిసరిగా పాటించి తమ ప్రాణాలను, ఆస్తులను కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు.

