అనధికార మధ్యవర్తులను ఆశ్రయించొద్దు: జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 28:
మెదక్ జిల్లా (27) బాలల సంక్షేమం, సంరక్షణలో భాగంగా చట్టబద్ధమైన దత్తత ప్రక్రియపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. చట్టబద్ధమైన విధానంలో దత్తత తీసుకోవడం ద్వారా బాలలకు సురక్షితమైన, ప్రేమానురాగాలతో కూడిన కుటుంబ వాతావరణం కల్పించవచ్చని పేర్కొన్నారు. గురువారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సమక్షంలో హైదరాబాద్‌కు చెందిన దంపతులు బాలల సదన్‌లో సంరక్షణ పొందుతున్న 11 ఏళ్ల బాలిక అపర్ణను అధికారిక చట్టబద్ధ దత్తత ప్రక్రియ ద్వారా తమ కుటుంబంలోకి స్వీకరించారు. 2025లో ప్రభుత్వ మిషన్ వాత్సల్య పోర్టల్ ద్వారా చట్టబద్ధ దత్తత కోసం దంపతులు దరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దత్తత తీసుకునే తల్లిదండ్రులు తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలు, సంబంధిత అధికారుల మార్గదర్శకాలను పాటించాలని సూచించారు. చట్టబద్ధమైన దత్తత ద్వారా బాలల భవిష్యత్తుకు భద్రత కల్పించడంతో పాటు కుటుంబ ప్రేమ, ఆప్యాయత, విద్య, ఆరోగ్యం, సమగ్ర సంరక్షణ అందించే అవకాశం కలుగుతుందని తెలిపారు. బాలలను చట్టవిరుద్ధంగా దత్తత తీసుకోవడం లేదా ఇతరులకు ఇవ్వడం చేయరాదని కలెక్టర్ స్పష్టం చేశారు. దత్తత విషయంలో ఎలాంటి అనధికార మధ్యవర్తులను ఆశ్రయించవద్దని ప్రజలకు సూచించారు. దత్తత తీసుకున్న బాలిక బాగోగులు, సంరక్షణను ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకు ఒకసారి పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం బాలికను దత్తత తీసుకున్న దంపతులను కలెక్టర్ అభినందించారు. బాలికకు మెరుగైన భవిష్యత్తు కల్పించేలా విద్య, ఆరోగ్యం, సంరక్షణతో పాటు సమగ్ర అభివృద్ధికి అవసరమైన సహకారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి హేమా భార్గవి, డీసీపీవో నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

