తడిసిన విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండండి – రైతులు విద్యుత్ పరికరాల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలి
A2న్యూస్, జులై 5, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్ (4)జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి అవసరమైన జాగ్రత్తలు పాటించాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు సూచించారు. అత్యవసర పరిస్థితులు మినహా వర్షం సమయంలో బయటకు వెళ్లకుండా ఉండాలని, ప్రయాణాలు చేసే వారు వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు. తడిసిన విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన విద్యుత్ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్లకు దూరంగా ఉండాలని, ప్రమాదకర పరిస్థితులు కనిపిస్తే వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసించకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, ఈదురుగాలులు, వర్షం సమయంలో చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని తెలిపారు. అలాగే వరద నీరు ప్రవహిస్తున్న వాగులు, కాలువలు, నీటితో నిండిన గుంతలను దాటేందుకు ప్రయత్నించవద్దని హెచ్చరించారు. వర్షం సమయంలో వాహనదారులు అతివేగాన్ని పూర్తిగా నివారించి నెమ్మదిగా వాహనాలు నడపాలని ఎస్పీ సూచించారు. రోడ్లు జారుడుగా ఉండటం, దృశ్యమానత తగ్గడం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని పేర్కొన్నారు. వాహనాల హెడ్‌లైట్లు, బ్రేకులు, వైపర్లు సక్రమంగా పనిచేస్తున్నాయో ముందుగానే తనిఖీ చేసుకుని, వాహనాల మధ్య సురక్షిత దూరం పాటించాలని సూచించారు. రైతులు పొలాల్లోని విద్యుత్ మోటార్లు, తీగలు, ఇతర విద్యుత్ పరికరాల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, తడి చేతులతో విద్యుత్ పరికరాలను తాకవద్దని ఎస్పీ సూచించారు. ఉరుములు, మెరుపులు సంభవిస్తున్న సమయంలో పొలాల్లో పనులు చేయకుండా సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని తెలిపారు. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే వెంటనే పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక శాఖలు లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని ఎస్పీ కోరారు. ప్రజల భద్రతే ప్రథమ ప్రాధాన్యమని, అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

