రోజురోజుకు కొత్త తరహా సైబర్ మోసాలు
ఏపీకే ఫైల్స్, క్యూఆర్ కోడ్‌లతో ఉచ్చు
మోసపోతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలి
A2న్యూస్, జులై 6, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్ (5) సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ కొత్త పద్ధతులతో ప్రజలను మోసగిస్తున్నారని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు సూచించారు. బ్యాంకు అధికారులు, ప్రభుత్వ సంస్థలు లేదా లోన్ కంపెనీల ప్రతినిధులమంటూ ఫోన్ చేసి ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ, యూపీఐ పిన్ వంటి గోప్య సమాచారాన్ని అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించవద్దని హెచ్చరించారు. ఇటీవలి కాలంలో (ఏపీకే) ఫైల్స్ పంపించడం, క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేయించడం, నకిలీ లోన్ యాప్‌లు, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఓఎల్ఎక్స్ వంటి సోషల్ మీడియా, ఆన్‌లైన్ వేదికల ద్వారా మోసాలు పెరుగుతున్నాయని తెలిపారు. అలాగే గిఫ్ట్ హ్యాంపర్లు, కేవైసీ అప్‌డేట్, రివార్డ్ పాయింట్లు, పెట్టుబడుల పేరుతో ప్రజలను మోసగించే ఘటనలు అధికమవుతున్నాయని పేర్కొన్నారు. తెలియని వ్యక్తులు పంపిన లింకులు, ఫైల్స్ లేదా యాప్‌లను డౌన్‌లోడ్ చేయవద్దని సూచించిన ఎస్పీ, బ్యాంకు ఖాతాలకు సంబంధించిన ఓటీపీ, యూపీఐ పిన్, ఏటీఎం కార్డు నంబర్, సీవీవీ, పాస్‌వర్డ్ వంటి వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దన్నారు. అనుమానాస్పద కాల్స్ లేదా సందేశాలు వచ్చిన వెంటనే వాటిని నిర్లక్ష్యం చేసి సంబంధిత అధికారిక సంస్థను సంప్రదించాలని సూచించారు. ఆర్థిక సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని ఎస్పీ సూచించారు. ముఖ్యంగా మోసం జరిగిన వెంటనే “గోల్డెన్ అవర్”లో ఫిర్యాదు చేస్తే మోసపోయిన నగదును నిలిపివేసే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని తెలిపారు. సైబర్ నేరాల నివారణలో ప్రజల అప్రమత్తత, అవగాహన, సకాలంలో ఫిర్యాదు చేయడం అత్యంత కీలకమని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు పేర్కొన్నారు.

