Thursday, September 17, 2026
Homeమెదక్ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు చేయాలి

ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు చేయాలి

📰 Generate e-Paper Clip

– అన్ని శాఖల సమన్వయంతో పండుగ వాతావరణంలో వేడుకలు నిర్వహిద్దాం: జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 4:

మెదక్ జిల్లా (3) ఆగస్టు 15న నిర్వహించే జిల్లా స్థాయి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జాతీయ స్పూర్తిని ప్రతిబింబించేలా, పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి సంపూర్ణ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల జిల్లా అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆమె మాట్లాడారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగే జిల్లా స్థాయి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేయాలని సూచించారు. వేదిక ఏర్పాటు, అతిథుల సీటింగ్, తాగునీటి సౌకర్యం, విద్యుత్, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత తదితర అంశాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. జిల్లాలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిబింబించేలా సమగ్ర జిల్లా ప్రగతి నివేదికను సిద్ధం చేయాలని జిల్లా ప్రణాళికాధికారిని కలెక్టర్ ఆదేశించారు. అలాగే ప్రోటోకాల్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ ప్రజాప్రతినిధులు, విశిష్ట అతిథులకు ఆహ్వానాలు పంపాలని సూచించారు. జాతీయ భావనను పెంపొందించేలా విద్యార్థులతో దేశభక్తిని చాటే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు విద్యాశాఖతో పాటు సంబంధిత శాఖలు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రశంసా పత్రాల బహూకరణ కోసం శాఖల వారీగా ఉత్తమ ఉద్యోగుల వివరాలతో కూడిన ప్రతిపాదనలను నిర్ణీత గడువులోగా సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి శాఖకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్, డీఆర్‌వో అంబాదాస్ రాజేశ్వర్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, రెవెన్యూ డివిజనల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!