A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 19:
మెదక్ జిల్లా (18) వివిధ కారణాల వల్ల సాధారణ పాఠశాలలు, కళాశాలల్లో విద్యను కొనసాగించలేకపోయిన వారికి తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) మంచి ప్రత్యామ్నాయ అవకాశాన్ని కల్పిస్తోందని మెదక్ జిల్లా విద్యాశాఖాధికారి రాజు అన్నారు. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓపెన్ ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్ ప్రవేశాలపై రూపొందించిన ప్రచార పోస్టర్ను జిల్లా విద్యాశాఖాధికారి రాజు తన కార్యాలయంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో మెదక్ జిల్లా కోఆర్డినేటర్ ఎ. వరప్రసాద్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కరుణాకర్, డీఈఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఈఓ రాజు మాట్లాడుతూ.. విద్యాభ్యాసాన్ని మధ్యలో నిలిపివేసిన వారు, ఉద్యోగులు, గృహిణులు, ఇతర కారణాల వల్ల రెగ్యులర్ విద్యను కొనసాగించలేని వారికి ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా చదువు కొనసాగించే అవకాశం ఉందన్నారు. TOSS ద్వారా ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చని తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు ఓపెన్ స్కూల్ విద్యా విధానంపై అవగాహన కల్పించేందుకు ఉపాధ్యాయులు, విద్యాశాఖ సిబ్బంది కృషి చేయాలని డీఈఓ రాజు సూచించారు. చదువుకు దూరమైన వారికి ఓపెన్ స్కూల్ ఒక మంచి అవకాశమని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.

