A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 19:
మెదక్ జిల్లా (18) బహుజన నాయకుడు, పోరాట యోధుడు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను భావితరాలకు తెలియజేసేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపునిచ్చారు. మంగళవారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతిని పురస్కరించుకుని పసుపులేరు ఒడ్డున రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద ఉన్న ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పూలమాల వేసి నివాళులర్పించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ అధికారులు, బీసీ కుల సంఘాలు, ఇతర కుల సంఘాల నాయకుల సమక్షంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మెదక్ జిల్లా కవులు, కళాకారులకు నిలయమని పేర్కొన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవిత చరిత్రను సమగ్రంగా రచించి పుస్తక రూపంలో భావితరాలకు అందించాలని సూచించారు. అణగారిన వర్గాలు, శ్రమజీవుల కష్టాన్ని దోచుకునే వారిని ఎదిరించి, సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం పోరాడిన మహనీయుడు పాపన్న గౌడ్ అని కొనియాడారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాట గాథలు నేటి తరానికి చైతన్యాన్ని, స్ఫూర్తిని అందిస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు. ఆయన ఆశయాలు, సామాజిక పోరాటం, బడుగు బలహీన వర్గాల కోసం చేసిన కృషిని ప్రతి ఒక్కరికీ తెలియజేయాల్సిన బాధ్యత ఉందన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఉపేందర్, బీసీ వెల్ఫేర్ సహాయ అధికారి గంగా కిషన్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ నరసింహారెడ్డి, బీసీ సంక్షేమ సంఘం మెదక్ జిల్లా అధ్యక్షుడు నోముల శ్రీకాంత్, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు రమేష్ గౌడ్, బీసీ కుల సంఘాల ప్రతినిధులు దామోదర్ గౌడ్, జనార్దన్ గౌడ్, కృష్ణ గౌడ్, చింతకింది కృష్ణగౌడ్, లక్ష్మీనారాయణ గౌడ్‌తో పాటు ఇతర కుల సంఘాల ప్రతినిధులు, బీసీ సంక్షేమ శాఖ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

