శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి: జాయింట్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 25:
కరీంనగర్ (24) ఈ నెల 26న నిర్వహించనున్న మిలాద్-ఉన్-నబీ వేడుకలు, ర్యాలీలు, ఇతర కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేలా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్, జోన్-III ఇన్చార్జి డీఐజీ సన్‌ప్రీత్ సింగ్ పోలీసు అధికారులను ఆదేశించారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. మిలాద్-ఉన్-నబీ బందోబస్తు, శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై కరీంనగర్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్ జిల్లాల పోలీసు అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వేడుకలు, ర్యాలీలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పలు కీలక సూచనలు చేశారు.
ర్యాలీలు, వేడుకలపై ప్రత్యేక నిఘా
ర్యాలీలు, ఇతర కార్యక్రమాలకు తగిన బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు సమస్యాత్మక ప్రాంతాలు, ప్రార్థనా స్థలాల వద్ద ప్రత్యేక పికెట్లు ఏర్పాటు చేయాలని డీఐజీ ఆదేశించారు. ర్యాలీలు, కార్యక్రమాలను ప్రారంభం నుంచి ముగింపు వరకు తప్పనిసరిగా వీడియో, ఫొటోగ్రఫీ చేయాలని సూచించారు. కార్యక్రమాల నిర్వాహకుల పూర్తి వివరాలను సేకరించి, వారికి బాధ్యతలను స్పష్టంగా వివరించాలని తెలిపారు. ముస్లిం కమ్యూనిటీలోని వివిధ వర్గాల ముఖ్య నాయకులతో సమావేశాలు నిర్వహించి కార్యక్రమాల వివరాలను ముందుగానే తెలుసుకోవాలని ఆదేశించారు. ఎలాంటి రెచ్చగొట్టే, అభ్యంతరకర లేదా ఇతర వర్గాలను కించపరిచే ప్రసంగాలు జరగకుండా నిర్వాహకులకు ముందస్తు సూచనలు ఇవ్వాలని చెప్పారు. గతంలో వివాదాస్పద ప్రసంగాలు చేసిన వ్యక్తులను గుర్తించి, భవిష్యత్తులో అలాంటి ప్రసంగాలకు పాల్పడకుండా ముందుగానే హెచ్చరించాలని సూచించారు. కమ్యూనిటీ పెద్దలు, కార్యక్రమాల నిర్వాహకులతో సమన్వయ సమావేశాలు నిర్వహించి వేడుకలను ప్రశాంతంగా నిర్వహించేందుకు వారి సహకారం తీసుకోవాలని అన్నారు. వివిధ వర్గాలు నిర్వహించే ర్యాలీలు ఒకదానితో ఒకటి ఎదురుపడకుండా ముందస్తు సమన్వయంతో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. యువత, విద్యార్థులు నిర్వహించే ఆందోళన కార్యక్రమాల సందర్భంగా బందోబస్తు సిబ్బందికి ముందుగానే సమగ్రంగా బ్రీఫింగ్ ఇవ్వాలని డీఐజీ సూచించారు. ఆందోళనకారులు పోలీసులను రెచ్చగొట్టే పరిస్థితులు ఎదురైనా సిబ్బంది అత్యంత సంయమనంతో, ఓర్పుతో, మర్యాదగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఆందోళన నిర్వాహకులు, పాల్గొనే వారి సంఖ్య, కార్యక్రమ స్థలం, నేపథ్యం తదితర వివరాలను ముందుగానే సేకరించి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ముఖ్యంగా యువత, విద్యార్థుల ఆందోళనలను తప్పనిసరిగా వీడియో రికార్డు చేయాలని సూచించారు.
ఎస్బీ అధికారులు తమ ఫీల్డ్ సిబ్బందిని అప్రమత్తం చేసి ఆందోళనలకు సంబంధించిన ముందస్తు సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించి ఉన్నతాధికారులకు అందించాలని తెలిపారు. ఆందోళనలను నియంత్రించే సమయంలో బందోబస్తు అధికారులు, సిబ్బంది అత్యంత జాగ్రత్తగా, ఓర్పుతో వ్యవహరించాలని సూచించారు. నిర్వాహకులను ముందస్తుగా అదుపులోకి తీసుకునే సందర్భంలోనూ అనవసరమైన బలప్రయోగం లేదా ఒత్తిడి చేయకుండా చట్టబద్ధమైన విధానాలను పాటించాలని స్పష్టం చేశారు. మిలాద్-ఉన్-నబీ వేడుకలు, ర్యాలీలు, ఇతర కార్యక్రమాలు ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా అన్ని ఎస్ఐలు, సీఐలు సూచనలను కచ్చితంగా అమలు చేయాలని జాయింట్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ఆదేశించారు.

