Saturday, October 17, 2026
Homeమెదక్కరెంట్ కోతలతో రైతులు విలవిల.. పంట నష్టాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి! నష్టపోయిన రైతులకు తక్షణ...

కరెంట్ కోతలతో రైతులు విలవిల.. పంట నష్టాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి! నష్టపోయిన రైతులకు తక్షణ పరిహారం అందించాలి – ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి

📰 Generate e-Paper Clip

విద్యుత్ కోతలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసిన నర్సాపూర్ ఎమ్మెల్యే

A2న్యూస్, మెదక్ జిల్లా/నర్సాపూర్ ప్రతినిధి (రాము) అక్టోబర్ 16:

నర్సాపూర్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో అంతరాయాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కరెంట్ కోతల కారణంగా పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు సక్రమంగా విద్యుత్ సరఫరా చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. నెలల తరబడి కష్టపడి, లక్షల రూపాయలు పెట్టుబడిగా పెట్టిన రైతులు విద్యుత్ సమస్యలతో నష్టపోతుంటే ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

విద్యుత్ ఉత్పత్తి, సరఫరాపై స్పష్టత ఇవ్వాలి

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టిందని ఎమ్మెల్యే గుర్తుచేశారు. ప్రస్తుతం వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఎందుకు ఏర్పడుతున్నాయో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు స్పష్టం చేయాలని కోరారు. విద్యుత్ ఉత్పత్తి, బొగ్గు లభ్యత, సరఫరాపై ముందస్తు ప్రణాళికతో వ్యవహరించి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.

సింగరేణిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి

తెలంగాణ విద్యుత్ వ్యవస్థకు కీలకమైన సింగరేణి సంస్థలో బొగ్గు ఉత్పత్తి, నిల్వలు, సరఫరాకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం వెల్లడించాలని వాకిటి సునీత లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. సింగరేణిలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని, సంస్థ వాటాల విక్రయం లేదా ప్రైవేటీకరణకు సంబంధించి ఏవైనా ప్రతిపాదనలు ఉంటే వాటిపై ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలని కోరారు.

పంట నష్టాలపై సర్వే.. రైతులకు పరిహారం

విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోయి, పెట్టుబడులు కోల్పోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆర్థికంగా ఆదుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. క్షేత్రస్థాయిలో పంట నష్టాలపై సమగ్ర సర్వే నిర్వహించి, నష్టపోయిన రైతులకు తగిన పరిహారం అందించాలని కోరారు. కాలిపోయిన మోటార్లు, దెబ్బతిన్న ట్రాన్స్‌ఫార్మర్లను యుద్ధప్రాతిపదికన మరమ్మతు చేసి, వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా సరఫరా చేయాలని స్పష్టం చేశారు.

అధికారులపై చర్యలతో సమస్య పరిష్కారం కాదు

విద్యుత్ సమస్యకు మూలకారణాలను గుర్తించి పరిష్కరించకుండా కేవలం అధికారులపై చర్యలు తీసుకోవడం వల్ల రైతులకు ఒరిగేదేమీ లేదని వాకిటి సునీత లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. విద్యుత్ సరఫరా వ్యవస్థను పర్యవేక్షిస్తూ, లోపాలను సరిదిద్ది రైతులకు సకాలంలో విద్యుత్ అందేలా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం, ఎండిపోతున్న పంటలను కాపాడటం, ఇప్పటికే నష్టపోయిన రైతులకు ఆర్థిక భరోసా కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించే వరకు బీఆర్ఎస్ పార్టీ వారి పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!