ఫిర్యాదుల పురోగతిని బాధితులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలి
చట్టబద్ధంగా, నిష్పక్షపాతంగా విచారణ జరపాలి
– మెదక్ జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్కుమార్ సింగ్
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 29:
మెదక్ జిల్లా (28) ప్రజావాణిలో అందే ప్రతి ఫిర్యాదుపై చట్టబద్ధంగా, నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధితులకు సత్వర న్యాయం అందించాలని మెదక్ జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్కుమార్ సింగ్ ఐపీఎస్ పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భూ వివాదాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక మోసాలు, వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులను పరిశీలించిన అదనపు ఎస్పీ.. సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఫిర్యాదుపై సమగ్రంగా విచారణ చేపట్టి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి జాప్యం చేయకుండా, విచారణ పురోగతిని బాధితులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన పోలీసు సేవలు అందించడంతో పాటు, సమస్యల పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనంతో వ్యవహరించాలని స్పష్టం చేశారు.

