ఆగస్టు 23 అర్ధరాత్రి నుంచి ఆర్ ఓ బి నిర్మాణ పనులు
ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలి: కలెక్టర్ ప్రతిమా సింగ్
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 22 :
చేగుంట( 21)చేగుంట (గాంధీ చౌక్) నుంచి మెదక్ వెళ్లే రహదారిలో రైల్వే ఓవర్ బ్రిడ్జి ఆర్ ఓ బి నిర్మాణ పనులు ఆగస్టు 23, 2026 అర్ధరాత్రి 12 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు చేగుంట–మెదక్ రహదారిలోని. ఎల్ సి నంబర్ 228T వద్ద రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వాహనదారులు ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని కలెక్టర్ సూచించారు. అలాగే ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా పోలీసులు ఇచ్చే సూచనలను వాహనదారులు తప్పనిసరిగా పాటించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
వాహనాల వారీగా ప్రత్యామ్నాయ మార్గాలు
ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు: ఎల్ సి గేటు వద్ద ఉన్న సీసీ రోడ్డు నుంచి పాత జాతీయ రహదారి వైపు, చేగుంట పట్టణ సరిహద్దులోని ప్రస్తుత ఆర్ యూ బి నుంచి బస్‌స్టాప్ ఎదురుగా ఉన్న వెంచర్ మీదుగా వెళ్లే మార్గాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కార్లు, బస్సులు, డీసీఎం వ్యాన్లు, ఇతర వాహనాలు: నార్సింగి నుంచి శంకరంపేట (ఆర్) మీదుగా మిర్జాపల్లి డబుల్ రోడ్డు మార్గాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. ట్రక్కులు, భారీ వాహనాలు: రామాయంపేట లేదా నర్సాపూర్ మార్గాల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. మాసాయిపేట నుంచి మెదక్ వెళ్లే వాహనాలు: శంకరంపేట (ఆర్) మీదుగా ధర్పల్లి రోడ్డును వినియోగించుకోవాలని కలెక్టర్ తెలిపారు. తూప్రాన్ నుంచి మెదక్ వెళ్లే వాహనాలు: వెల్దుర్తి–ఉప్పులింగాపూర్–గవ్వలపల్లి మార్గం ద్వారా వెళ్లాలని సూచించారు. ఆర్ ఓ బి నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు ప్రజలు, వాహనదారులు సహకరించాలని, ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ కోరారు. నిర్మాణ పనుల నేపథ్యంలో పోలీసుల సూచనలు పాటిస్తూ ప్రయాణాలు సాగించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

